Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూస్‌క్లిక్, న్యూస్‌లాండ్రీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు
- జర్నలిస్టుల వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లాక్కున్న అధికారులు
- స్వతంత్ర మీడియాపై వేధింపులు : ఎడిటర్స్ గిల్డ్
న్యూఢిల్లీ : దేశంలో స్వంతంత్ర మీడియాను బెదిరించటం, వేధింపులకు గురిచేయటం అత్యంత ప్రమాదకరమైన ధోరణి..అని 'ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' ఆందోళన వ్యక్తం చేసింది. ఆన్లైన్ న్యూస్ వెబ్‌పోర్టల్స్ న్యూస్‌క్లిక్, న్యూస్లాండ్రీలకు చెందన ఢిల్లీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించడాన్ని 'ఎడిటర్స్ గిల్డ్' తీవ్రంగా ఖండించింది. కక్షపూరిత ధోరణితో న్యూస్ వెబ్పోర్టల్స్పై ఇప్పటికే పలుమార్లు ఐటీ దాడులు నిర్వహించారని, ఇప్పుడు మళ్లీ 'ఐటీ శాఖ సర్వే' పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం చర్యల్ని పత్రికాస్వేచ్ఛపై దాడిగా అభివర్ణించింది.
న్యూస్ క్లిక్, న్యూస్లాండ్రీలపై ఐటీ శాఖ అధికారుల సర్వేను 'ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్'(డీయూజే) ఖండించింది. స్వతంత్ర మీడియా సంస్థలను బెదిరించడానికి, వేధించడానికి కేంద్రం చేపట్టిన చర్యగా డీయూజే అభిప్రాయపడింది. న్యూస్ పోర్టల్స్ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 11 గంటల నుంచి సోదాలు మొదలుపెట్టారు. శనివారం రాత్రివరకూ సోదాలు కొనసాగాయి.
న్యూస్‌లాండ్రీ సహవ్యవస్థాపకుడు అభినందన్ సిక్రీ వ్యక్తిగత ఫోన్, ల్యాప్‌ట్యాప్, కార్యాలయంలోని ఇతర సామాగ్రిని ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే న్యూస్‌క్లిక్ కార్యాలయంలో ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా వ్యక్తిగత ఫోన్, ఇతర పత్రాలు ఐటీ శాఖ అధికారులు లాక్కున్నారని ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది. పుర్కాయస్థా ఈమెయిల్ ఖాతా, ఎడిటర్ ప్రంజాల్, ఇతర ఉద్యోగుల ఈమెయిల్ ఖాతా వివరాల్ని, న్యూస్‌క్లిక్ ఆర్థిక ఖాతాల వివరాల్ని ఐటీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ''పౌర హక్కులపై, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి ఇది. ఐటీ శాఖ అధికారులు వ్యవహరించిన తీరు ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది'' అని ఎడిటర్స్ గిల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
మీడియాపై కక్షపూరిత ధోరణి : ఎడిటర్స్ గిల్డ్
న్యూస్ వెబ్‌పోర్టల్స్‌కు చెందిన జర్నలిస్టులు, ఎడిటర్స్ వ్యక్తిగత సమాచారాన్ని సీజ్ చేయటం, కార్యాలయాల్లోని పరికరాల్ని స్వాధీనం చేసుకోవటాన్ని ఖండిస్తున్నాం. ఐటీ చట్టంలోని సెక్షన్ 133-ఎ ప్రకారం జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోరాదు. బయటకు ఇది ఐటీ శాఖ సర్వేగా చెబుతున్నా...ఇది మీడియాను బెదిరించటం, వేధించటమే. ఐటీ చట్టం-2000లో పేర్కొన్న నియామవళికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల్ని, పాలకుల తీరును విమర్శిస్తూ వార్తా కథనాలు రాయటం వల్లే..కక్షపూరిత ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోందని భావిస్తున్నాం.