Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఆరునెలల వరకు నిరసనలకు నో
- యూపీలో యోగి సర్కారు ఉక్కుపాదం
లక్నో : దేశంలో రాజ్యాంగం కల్పించిన 'నిరసన' హక్కుపై యూపీలోని యోగి సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఇందులో భాగంగా ఎస్మా చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటున్నది. వచ్చే ఆరునెలలు రాష్ట్రంలో నిరసనలు జరగకుండా ఎస్మాను మరోసారి పొడగించింది. యూపీ సర్కారు ఎస్మాను ఈ విధంగా పొడగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ, యూపీ జల్ నిగమ్ (యూపీజేఎన్), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కు చెందిన ఐదు కార్మిక సంఘాల ఉద్యోగులు ఈనెల 29 నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారు వారి స్ట్రైక్‌కు అడ్డుకట్ట వేసే విధంగా ఎస్మాను పొడగించడం గమనార్హం. '' ప్రభుత్వ కాంట్రాక్టు కార్మికుల ఏదైనా నిరసన వచ్చే ఆరు నెలల వరకు నిషేధం'' అని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు పట్టణాభివృద్ధి అదనపు ప్రధాన కార్యదర్శి రాజ్నీశ్ దూబే నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. కాగా, యోగి సర్కారు తీరుపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటూ కార్మికుల హక్కులను కాల రాస్తున్నదని ఆరోపించారు. ఎస్మా పొడగింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.