Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో దాడులు ఆపాలి
- రాష్ట్రపతిని కలుస్తాం
- ప్రధానికి లేఖ రాశాం.. స్పందన లేదు
- ధర్నాలో సీతారాం ఏచూరి
- దేశవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆందోళనలు
- మద్దతుగా కలిసివచ్చిన వామపక్షపార్టీలు
న్యూఢిల్లీ : త్రిపురలో జరిగిన దాడి, తమ పార్టీకి వ్యతిరేకంగా జరిగిన దాడి మాత్రమే కాదనీ, దేశంలోని రాజ్యాంగ నిర్మాణానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. త్రిపురలోని సీపీఐ(ఎం) కార్యాలయాలపై దాడికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన జరిగింది. ప్లకార్డులు చేబూని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ సీపీఐ(ఎం), బీజేపీ ఘర్షణలకు ప్రధాన స్రవంతి మీడియా తప్పుడు రంగును పూసిందనీ విమర్శించారు. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం), దాని ప్రజా సంఘాలు చేస్తున్న ప్రజా ఉద్యామంపై టెర్రర్ దాడికి కాషాయ పార్టీ ప్రయత్నించిందని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంతో పాటు వందలాది పార్టీ కార్యాలయాలు, పార్టీ కార్యకర్తల ఇండ్లు, మీడియా సంస్థల కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు దాడిచేశారని విమర్శించారు. త్రిపుర కమ్యూనిస్టు ఉద్యమం గతంలో ఇటువంటి అనేక పాలక వర్గ అణచివేతలను ఎదుర్కొందనీ, ప్రజల మద్దతుతో దీనిని కూడా అధిగమిస్తుందని స్పష్టం చేశారు. అణచివేత తక్షణమే ఆపాలని హితవు పలికారు.
లౌకికవాదానికి ఎర్రజెండా రక్షణ
ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ తన మనువాది సిద్ధాంతం కోసం, ప్రజాస్వామ్య నిర్మాణం, రాజ్యాంగం అవసరాలను నాశనం చేస్తుందనీ, కూల్చివేస్తుందని విమర్శించారు. హిట్లర్ చేసిన ఈ విధమైన దాడులు ఓటమి చెందాయని, ఎర్ర జెండా మాత్రమే ఎగురుతుందని స్పష్టం చేశారు. లౌకికవాదానికి ఎర్రజెండా రక్షణగా నిలస్తుందన్నారు. మోడీ ఆధ్వర్యంలో దేశంలో లూటీ (దోపిడి) జరుగుతుందనీ, వీటికి వ్యతిరేకంగా జీవనోపాధి, కార్మికులు, రైతుల హక్కులు, శ్రామిక ప్రజల పక్షం పోరాడుతున్నది కేవలం ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే అన్నివైపులా వామపక్షాలపై దాడులు చేస్తున్నారనీ, అందుకు కోసం వివిధ పద్ధతులను వాడుతున్నారని తెలిపారు. ఆదివాసీ నాయకుడు కామ్రేడ్ దశరథ్ దేవ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారనీ, ఆయన ఆదివాసులకు తిరుగులేని నాయకుడనీ, స్వాతంత్ర సమరయోధుడని అన్నారు. భారతదేశంలో త్రిపుర ఎలా భాగమైందో బీజేపీ నేతలకు తెలియదనీ, భారతదేశ స్వేచ్ఛలో త్రిపుర భాగం కావడానికి దేవ్ కృషి మరువలేనిదని అన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ఆయన విగ్రహాన్ని కూల్చిందని విమర్శించారు.
రాష్ట్రపతిని కలుస్తాం
మోడీ సర్కార్కు ప్రజలు క్రమంగా దూరమవుతున్నారనీ, రాబోయే రోజుల్లో మరింత మంది ప్రజలు బీజేపీని వీడతారన్నారు. ఇందిరాగాంధీ లాంటివాళ్ళే గద్దెదిగాల్సి వచ్చిందనీ, ప్రజలు తలుచుకుంటే ఈ మోడీ ఎంతని ప్రశ్నించారు. అన్ని శక్తులతో కలిసి ప్రతిఘటిస్తామనీ, పోరాటాన్ని విరమించుకునేది లేదని స్పష్టం చేశారు. విస్తతంగా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపు ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై దాడులు ఆపాలని తాను ప్రధానికి లేఖ రాశానని, అయితే ఆయన వింటాడని అనుకోవటంలేదని ఏచూరి అన్నారు. త్రిపురలోని దాడిపై రాష్ట్రపతిని కూడా కలుస్తామని ఏచూరి తెలిపారు.
ముందస్తు ప్రణాళికతోనే దాడులు : ప్రకాష్ కరత్
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ మాట్లాడుతూ త్రిపురలో జరిగిన అల్లకల్లోలం గురించి వివరించారు. పార్టీ కార్యాలయంపై ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగిందని అన్నారు. పార్టీ కార్యాలయాలను తగలబెట్టడమే కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా దాడి చేశారన్నారు. ఇప్పటి వరకు 28 మంది కార్యకర్తలను హత్యచేశారని తెలిపారు. ఫ్యూడల్స్, రాజాలకు వ్యతిరేకంగా ఎర్ర జెండా పోరాడిందనీ, 1983లో విమరీతమైన దాడులను ఎదుర్కొందని గుర్తు చేశారు. దాడులకు వ్యతిరేకంగా త్రిపుర ప్రజలతో కలిసి పార్టీ పోరాడుతుందని తెలిపారు.
ఖండిస్తున్నాం : డి.రాజా
సీపీఐ(ఎం) కార్యాలయాలపై దాడిని సీపీఐ ఖండిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. నవంబర్లో సీపీఐ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారని తెలిపారు. ఆర్ఎస్ఎస్, ఫాసిస్ట్ శక్తులు, గూండాలు ఆగుతాయని అనుకోవద్దని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా పోరాడాలని అన్నారు.