Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొనుగోలు
- 77 కోట్లతో టేకోవర్ : సీఎం విజయన్
తిరువనంతపురం : కాసర్గోడ్ కేంద్రంగా పనిచేసే విద్యుత్ యంత్రాల తయారీ సంస్థ భెల్-ఈఎంఎల్ను కేరళ ప్రభుత్వం తిరిగి తన చేతులోకి తెచ్చుకున్నది. ఇప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) చేతిలో ఉండేది. అయితే, భెల్ నుంచి కేరళ ప్రభుత్వం దీనిని తిరిగి కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక ఆన్లైన్ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి పీ. రాజీవ్ అధ్యక్షత వహించారు. కొత్త యూనిట్‌ను కాసర్గోడ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ లిమిటెడ్‌గా రాష్ట్ర పరిశ్రమల శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనిట్‌ను రూ. 77 కోట్లతో టేకోవర్ చేసిందని విజయన్ తెలిపారు. ఇందులో రూ. 34 కోట్లు కంపెనీ అప్పులకు, రూ. 43 కోట్లు కంపెనీ పునరుద్ధరణకు అయ్యే మొత్తం. ఈ కంపెనీలోని 174 మంది ఉద్యోగులకు భెల్ గత రెండేండ్లుగా జీతాలు చెల్లించలేదు. జీతాలకు సంబంధించిన మొత్తం బకాయిలే రూ. 14 కోట్లుగా ఉండటం గమనార్హం. జోక్యం చేసుకోగలిగే అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) సర్కారు ప్రారంభించాలని ఈ సందర్భంగా విజయన్ తెలిపారు. ప్రభుత్వ రంగ అన్ని సంస్థలను లాభాదాయకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అయితే, భెల్ నిర్లక్ష్యం చేసిన ఈ కాసర్గోడ్ యూనిట్‌ను తిరిగి కొనుగోలు చేసి దానిని ఆధునీకరించడానికి చేస్తున్న కేరళ చర్యలపై ఆ కంపెనీ ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.