Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 రోజుల్లో చనిపోతే అది కోవిడ్ డెత్
న్యూఢిల్లీ : కోవిడ్-19 పాజిటివ్‌తో బాధితుడు 30 రోజుల్లోపు ఆసుపత్రిలో లేదా ఇంటిలో మరణిస్తే... సంబంధిత వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రంలో కోవిడ్ -19గా నిర్ధారిస్తారని కేంద్రప్రభుత్వం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం... కరోనా బాధితుడు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, 30 రోజుల్లోగా మరణిస్తే దానిని కోవిడ్ మరణంగా ధ్రువీకరిస్తారు. ఆర్టిపిసిఆర్ టెస్ట్ లేదా యాంటిజెన్ టెస్ట్ లేదా క్లినికల్ పద్ధతిలో కోవిడ్ నిర్ధారణ అయితేనే దానిని పరిగణలోకి తీసుకుంటారు. కోవిడ్ మరణాలపై స్పష్టమైన విధివిధానాలు తయారు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అనుసరించి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంయుక్తంగా ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
కొత్తగా 28,591 కరోనా కేసులు
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,30,125 కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 28,591 కేసులు వెలుగులోకి వచ్చాయి. 338 మంది మరణించారు. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పో యినవారి సంఖ్య 4,42,655కి చేరింది. 34,848 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోవిడ్‌ను జయించినవారి సంఖ్య 3,24,09,345కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,84,921 (1.16 శాతం) క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 72,86,883 మందికి శనివారం టీకాలు అందాయి. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 73.82 కోట్లకు చేరింది.