Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : మహాకవి శ్రీశ్రీ విశ్వరూపానికి ప్రతి రూపం మహాప్రస్థానం కవితా సంపుటి అని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరిణి అన్నారు. సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో శ్రీశ్రీ ప్రింటర్స్ ప్రచురించిన మహాప్రస్థానం కవితా సంపుటి 'నిలవెత్తు నీరాజనం' ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తనికెళ్ల భరణి ఈ సంపుటిని ఆవిష్కరించి మాట్లాడుతూ సమకాలీన సాహితీవేత్తల్లో శ్రీశ్రీ స్థానం సుస్థిరమైనదన్నారు. నేటి తరం యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సాహిత్య ప్రక్రియలు చేపట్టాలని సూచించారు. తెలుగువారు గర్వించదగిన కవి శ్రీశ్రీ అని అన్నారు. శ్రీశ్రీ సాహిత్యం శత వసంతాలే కాదు శత సహస్ర వసంతాలు విరబూస్తుందని పేర్కొన్నారు. మహా ప్రస్థానం కవితా సంపుటిలో సమాజ చిత్రీకరణ కనిపిస్తోందన్నారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు మాట్లాడుతూ శ్రీశ్రీ అక్షరాలు రుధిర జ్వాలలని అభివర్ణించారు. శ్రీశ్రీ తన కవితా సంపుటి నిలువుటద్దం సైజులో ఉండాలని భావించేవారన్నారు. పెద్ద సైజులో వేసి శ్రీశ్రీ ప్రింటర్స్ దానిని సాకారం చేసిందని పేర్కొన్నారు. కథా వార్షిక సంపాదకులు వాసిరెడ్డి నవీన్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, కథా రచయిత ఖదీర్ బాబు, విద్యావేత్త బండ్ల మాధవరావు, యువ కవి అనిల్ డ్యానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశ్రీ అభిమానులు మహా ప్రస్థానం కవితాసంపుటిలోని భాగాలను చదివి వినిపించారు.