Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలహాబాద్ హైకోర్టు 'ఇందిరా గాంధీ అనర్హత' తీర్పుపై సీజేఐ
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు వెలువర్చిన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఒక యూనివర్సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1975లో అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పును వెలువర్చింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ అప్పటి భారత ప్రధానిగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ అప్పటి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా.. ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించారు. దీంతో ఆరేండ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెపై నిషేదం పడింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఫలితంగానే ఇందిర.. దేశంలో ఎమర్జెన్సీని విధించడం, తదనతర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చని రమణ తెలిపారు. దేశానికి అలహాబాద్ బార్ అండ్ బెంచ్ చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. అలహాబాద్ హైకోర్టుకు 150 ఏండ్ల చరిత్ర ఉన్నదని గుర్తు చేశారు. అలాగే, ఈ హైకోర్టులో పేరుకుపోతున్న పెండింగ్ క్రిమినల్ కేసుల పట్ల సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అలహాబాద్ బార్ బెంచ్ కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు. భారత పౌరుల హక్కులు, స్వేచ్ఛను కాపాడటానికి చొరవ తీసుకోవాలని న్యాయ సమూహానికి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.