Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహ్మదాబాద్ టెక్స్టైల్ పరిశ్రమల్లో పని పరిస్థితులపై ఓ స్వచ్ఛంద సంస్థ నివేదిక
అహ్మదాబాద్: ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచిన అహ్మదాబాద్‌లోని టెక్స్టైల్ పరిశ్రమలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ రక్షణలేని, అమానవీయ, పని దోపిడీ పరిస్థితులు ఉన్నాయని ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. గుజరాత్లో ఇటీవలి కాలంలో పారిశ్రామిక ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత రెండేండ్లలో ఏకంగా 322 పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి. అయితే, నారోల్లో అగ్నిప్రమాదాలకు దారితీసే కార్మిక విధానాలు, ఇతర అంశాలకు సంబంధించి అజీవికా బ్యూరో అనే లాభపేక్షలేని సంస్థ సర్వే నిర్వహించి తాజాగా 'లుకింగ్ బియాండ్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్' పేరుతో నివేదికను విడుదల చేసింది. అందులో ప్రస్తావించిన అంశాల ప్రకారం.. అహ్మదాబాద్‌లో వస్త్ర పరిశ్రమల్లో రక్షణలేని, అమానవీయ, దోపిడీ పనిపరిస్థితులు ఉన్నాయి. కార్మికులకు భద్రత లేకపోవడం, పనిప్రాంతం భద్రతా చట్టాలకు అనుగుణంగా లేకపోవడం అంటే ఫ్యాక్టరీల చట్టం-1948కి విరుద్ధంగా ఉన్న విషయాలను ఎత్తిచూపింది. అక్కడి ప్రమాదకర పరిస్థితుల గురించి, ప్రాణాల ముప్పు గురించి కార్మికులకు తెలుసు అయితే, వారి మనుగడ, ఆహారం, ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కోసం అందులో కొనసాగుతున్నారని నివేదిక పేర్కొంది. అక్కడి కర్మాగారాల్లో ప్రమాదకరంగా ఉన్నట్టు బహిర్గతమైంది.తీవ్రమైన వేడి, ధూళి కాలుష్యం వంటి ప్రమాదకర పని పరిస్థితులు ఉన్నాయి.వలస కార్మికుల అందించే చౌక కార్మిక శక్తిపై ఆధారపడి ఉన్నాయనీ,కార్మికుల శక్తి దోపిడీ జరుగుతున్నదని నివేదిక పేర్కొంది. కార్మికులకు కుల ఆధారంగా యూనిట్ల కేటాయింపు,వారి వృత్తిపరమైన పాత్రలు, అక్కడి పరిస్థతులు ఉన్నాయి.ఎస్సీ, ఎస్టీ కార్మికులకు దిగువ స్థాయి స్థానాలు సైతం కేటాయిం చారని ఈ అధ్యయన పరిశోధకులు గుర్తించారు. అగ్నిప్రమాదాలను నివారించడానికి ఏర్పాట్లు ఉన్నట్టు కనిపించినా.. నిశితంగా పరిశీలిస్తే అవి చూడ్డానికే ఏర్పాటేచేసిన విషయం తెలుస్తుందని తెలిపింది. ఇక కార్మికులకు శిక్షణ లేకపోవడం, ప్రోటోకాల్స్‌తో పరిచయం లేకపోవడంతో ప్రమాదం మరింతగా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. అగ్నిమాపక యంత్రాలను ఆపరేట్ చేయడానికి కూడా తగినంత ఏర్పాట్లు లేవని పేర్కొంది. ఈ కర్మాగారాల్లో పనిచేసే సర్వే చేయబడిన కార్మికుల్లో కేవలం 4 శాతం మంది మాత్రమే పేరోల్‌లో ఉండగా, మిగిలిన 96 శాతం మంది సాధారణ ఒప్పందాల ద్వారా నియమించారు. 12 గంటల షిప్టు పనుల్లో.. 40 శాతం మంది కార్మికులు ఎటువంటి విరామం లేకుండా 24 గంటలు సహా ఓవర్ టైమ్ పనిచేయడానికి అంగీకరించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది.