Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెటిజన్ల ట్రోలింగ్.. తృణమూల్ నాయకుల ఆగ్రహం
- సోషల్ మీడియాలో యూపీ ప్రభుత్వానికి చురకలు
లక్నో : సోషల్ మీడియాలో యోగి సర్కారుకు ఎదురుదెబ్బ తాకింది. కోల్‌కతా ఫ్లైఓవర్ ఫోటోను తమ ప్రకటనల్లో ఒకటిగా వాడుకోవడమే దీనికి కారణం. '' ట్రాన్స్ఫార్మింగ్ ఉత్తరప్రదేశ్ అండర్ ఆదిత్యనాథ్'' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ ఆంగ్ల పత్రికలో ఒక ప్రకటన ప్రచురితమైంది. ఇందులో రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల గురించిన ఫోటోల సమూహంతో పాటు రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఉన్నది. అయితే, ఆ మౌలిక సదుపాయాలకు సంబంధించిన చిత్రాలలో ఒకటి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఫ్లైఓవర్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్లు వెంటనే గుర్తించారు. దీంతో ఈ ప్రకటనపై దుమారం రేగింది. యోగి ప్రభుత్వంపై ఇటు సోషల్ మీడియా యూజర్లు, అటు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. '' కోల్‌కతాలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఫోటోలు దొంగిలించి ప్రజాధనాన్ని వెచ్చించి భారతదేశంలోని వార్తపత్రికల్లో ప్రకటనలు ఇవ్వడమే అభివృద్ధా?'' అని టీఎంసీ నాయకుడు సాకేత్ గోఖలే ప్రశ్నించారు. మరికొందరయితే, బీజీంగ్ ఏయిర్పోర్టు, బుర్జ్ ఖలీఫా లాంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాల ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఇవన్నీ యోగి నిర్మించినవే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. '' దొంగిలించిన అభివృద్ధి'' అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్‌లో ఉన్నది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ యూపీ ప్రభుత్వంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.