Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడులు తెరుచుకోని చోట నగదు బదిలీ : కేంద్రం
- రూ.100తో పౌష్టికాహారం భర్తీ అవుతుందా? : హక్కుల కార్యకర్తలు
న్యూఢిల్లీ : పాఠశాల విద్యలో అత్యంత కీలకమైన 'మధ్యాహ్న భోజన పథకం'పై నీలీనీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే సబ్సిడీలకు కోత పెడుతున్న మోడీ ప్రభుత్వం..పేద బిడ్డలకు చదువుకునే అవకాశం నుంచి దూరం చేయాలనుకుంటున్నది. అందులో భాగంగా.. మిడ్ డే మిల్స్‌పై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో పేద కుటుంబాల్లో ఆందోళనవ్యక్తమవుతున్నది. గత ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఈనేపథ్యంలో ఆహార భద్రత కింద విద్యార్థులకు పథకం అమలు జరిగిన తీరు, ఎలాంటి ఆహార పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తున్నారు? పప్పులు, వంటనూనె, బియ్యం..తదితర సరుకులకు అయ్యే ఖర్చులపై ఆడిటింగ్ జరపాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది, రెండేండ్లుగా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మొదటి తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులెవ్వరూ పాఠశాలలకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆహార భద్రతా అలవెన్స్ కింద ప్రతి విద్యార్థికి నెలకు రూ.100 నగదు బదిలీ చేయాలని గత ఏడాది కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసంగానూ రూ.1200కోట్లు విడుదలచేసింది. అయితే కేంద్రం ప్రభుత్వ నిర్ణయంపై సామాజిక కార్యకర్తలు, బాలల హక్కుల కార్యకర్తలు పెదవి విరిచారు. నగదు బదిలీ ద్వారా విద్యార్థులకు పంపిన రూ.100 ఏమూలకు సరిపోతుంది? ఈ మొత్తంతో విద్యార్థుల పౌష్టికాహార అవసరాలు తీరుతాయా? అని హక్కుల కార్యకర్తలు ప్రశ్నించారు. అయితే నగదు బదిలీ అమలు, 9-12 తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా క్షేత్రస్థాయిలో ఎలా ఉందన్నదానిపై కేంద్రం సమీక్ష జరపాలని నిర్ణయించింది. ఇందుకోసంగానూ ప్రముఖ సంస్థ సేవల్ని ఉపయోగించుకోబోతున్నామని కేంద్రం విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో పథకం అమలులో అనేక అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని గత ఏడాది జనవరిలో జరిగిన ఆడిటింగ్‌లో తేలింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం ద్వారా సుమారుగా 12కోట్లమంది విద్యార్థులు లబ్దిపొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 11.4లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కనీసం 200 రోజులపాటు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని కేంద్రం చెబుతోంది. ''గత ఏడాది, రెండేండ్లుగా కరోనా కారణంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలన్నీ మూతపడ్డాయి. చాలా రాష్ట్రాల్లో 9-12 తరగతుల విద్యార్థులకు క్లాసులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన నిధులు లబ్దిదారులకు చేరుతుందా లేదా? అన్నది పరిశీలించాలనుకున్నా''మని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు.