Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ విధానాలను తిప్పికొట్టడానికి దేశవ్యాప్త ఉద్యమాలు అవసరం
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక, సామాజిక పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపు ఇచ్చారు. ఆర్థిక, సామాజిక పోరాటాలను సమన్వయం చేసుకొని ప్రజా పోరాటాలను నిర్మించాలని అన్నారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ), దళిత శోషన్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) ఉత్తరాది రాష్ట్రాల శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు సభలో బి.వి రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన దాడిని చేస్తున్నదనీ, ప్రజల మధ్య విభజనను సృష్టిస్తున్నదని విమర్శించారు. బీజేపీ విధానాలను ప్రతిఘటించాలంటే, ఆర్థిక దోపిడీకి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలను చేపట్టాలని పిలుపు ఇచ్చారు.ఆర్థిక రంగంలో కార్పొరేట్ విధానాలను మోడీ ప్రభుత్వం వేగవంతం చేసిందనీ, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వం రంగం దెబ్బతింటే దేశ అభివృద్ధి, దేశ సమగ్రతకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతున్నదన్నారు. అలాగే సామాజిక న్యాయానికి పెను ముప్పు పొంచి ఉన్నదని తెలిపారు. సమాజంపై బీజేపీ హిందూత్వాన్ని రుద్దుతున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తుందని విమర్శించారు. మతాల పేరుతో, కులాల పేరుతో విభజన రాజకీయాలను చేస్తోందని, విద్వేష పూరితం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దళిత, గిరిజన, మైనార్టీ, మహిళలపై దాడులు పెరిగాయని, ఆయా వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు చేపడుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో ఏఐఏడబ్ల్యూయూ, డీఎస్ఎంఎం ఐక్యంగా, విడివిడిగా పోరాటాలు బలోపేతం చేయాలని సూచించారు. ఈ శిక్షణ తరగతుల్లో బృందా కరత్, సుభాషిణి అలీ, అశోక్ ధావలే, విజూ కృష్ణన్, బి.వెంకట్, రామచంద్ర డోమ్, విక్రమ్ సింగ్ తదితరులు వివిధ అంశాలపై బోధించారు.