Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 27 భారత్ బంద్‌కు ప్రత్యేక సమన్వయ కమిటీ
- వచ్చే నెలలో చంపారన్ నుంచి వారణాసి వరకు 'పాదయాత్ర'
- బీజేపీ ప్రభుత్వంపై ఉధృత పోరుకు సిద్ధమవుతున్న ఎస్కేఎం
లక్నో: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకుంటున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేరకంగా రైతులు కొనసాగిస్తున్న ఉద్యమం దేశం నలుమూలకు విస్తరిస్తూ.. ఉధృతరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని దాదాపు 85కు పైగా రైతు సంఘాలు బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లో తీసుకుపోవడానికి 'మిషన్ యూపీ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వివిధ రైతు సంఘాలు లక్నోలో సమావేశమై రోడ్‌మ్యాప్ తయారీపై చర్చించాయి. ఈ సమావేశంలో ఎస్కేఎం నాయకులతో పలు బృందాలను ఏర్పాటు చేశారు. వారు రైతు ఉద్యమాన్ని, బీజేపీ సర్కారు వ్యతిరేక ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి.. ఉద్యమానికి రైతులను సమీకరించడంతో పాటు వివిధ పనుల్లో ఉన్న కార్మికులు, మహిళలు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు సహా విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ఇతర సామాజిక సంస్థలతో ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న జరగబోయే 'భారత్ బంద్'కు ముందు పాలక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమంలో చేరాలని ఆయా వర్గాల ప్రజలు, సంస్థలను ఎస్కేఎం నేతలు కోరారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో రైతులకు సంబంధించిన విషయాలతో పాటు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలపై సైతం చర్చ జరిగింది. బీజేపీ, దాని మిత్రపక్షాలైన కార్పొరేట్ దిగ్గజాలను సామాజికంగా బహిష్కరిస్తామని నిర్ణయించారు. అలాగే, ఈ నెలలో జరిగే భారత్ బంద్‌ను సమన్వయం చేయడం కోసం హరినామ్ సింగ్ వర్మ, డీపీ సింగ్, తేజీందర్ సింగ్ విర్క్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల సమన్వయ కమిటీ సైతం ఏర్పాటైంది.
350 కిలోమీటర్ల 'పాదయాత్ర'
''ముజఫర్ నగర్ మహాపంచాయితీ తరహాలో, రాష్ట్రంలోని మొత్తం 18 డివిజన్లు, 75 జిల్లాల్లో రైతుల ర్యాలీలు, మహాపంచాయితీ, సామాజిక అవగాహన కార్యక్రమాను నిర్వహించాలని ఎస్కేఎం నిర్ణయించింది. 'అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరుకుంటాం. దేశ ప్రజలను విభజించే బీజేపీ ప్రభుత్వ మతం, కుల రాజకీయాలను తరిమికొడుతూ.. ఎదుర్కొంటాం. యూపీలో మతతత్వం, ద్వేష, కార్పొరేటైజేషన్ చర్యలను అడ్డుకుంటామని' రైతు నాయకుడు అశోక్ ధవాలే అన్నారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న 10 నెలలకు పైగా పోరాట అంశాలను సైతం ప్రస్తావించారు. మరో రైతు నాయకుడు దర్శన్ పాల్ మాట్లాడుతూ.. మిషన్ యూపీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతుందనీ, రైతులను దోపిడీకి గురిచేస్తున్న యోగి, మోడీ ప్రభుత్వాల వ్యతిరేక ఉద్యమమే మిషన్ యూపీ అని పేర్కొన్నారు. అయితే, రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తమ మద్దతు ఉంటుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిఒక్కరినీ కోరతామని పాల్ తెలిపారు. అలాగే, చంపారన్ నుంచి వారణాసి వరకు రెండు వారాల వ్యవధిలో సుమారు 350 కిలోమీటర్ల 'పాదయాత్ర' (మార్చ్)ను సైతం నిర్వహించనున్నటు తెలిపారు. ఇది అక్టోబర్ 2న బీహార్‌లోని చంపారన్ నుండి ప్రారంభమై అక్టోబర్ 20న వారణాసి చేరుకుంటుందని పాల్ తెలిపారు.
17న మరో సమావేశం
ఈ నెల 27 'భారత్ బంద్్'ను విజయవంతం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు హరినామ్ సింగ్ వర్మ అన్నారు. దీని కోసం ఈ నెల 17న మరోసారి సమావేశం జరుగుతుందని తెలిపారు. రైతు సంఘాలతో పాటు కార్మిక సంఘాలు, రవాణా సంఘాలు, మహిళా సంస్థలు, యువజన సంస్థలు, పౌర సమాజం, వ్యాపారుల సంక్షేమ సంఘం ఇందులో భాగం అవుతాయన్నారు. ఎన్నికలకు ముందు ఇంటింటి ప్రచారంలో వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు, రైతుల దోపిడీ, విద్యుత్ సవరణ బిల్లు-2020 ఉపసంహరణ, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సమగ్ర ఖర్చుకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కొనుగోలు కు చట్టపరమైన హామీ డిమాండ్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.