Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మహా పాదయాత్ర
- బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలి : మంత్రి ముత్తంశెట్టి
- నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది: సిహెచ్.నర్సింగరావు
విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన ఆదివారం మహా పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన లభించింది. సీపీఐ(ఎం), సీపీఐ, టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నిర్వాసితులు భాగస్వాములయ్యారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు గాజువాక బీసీ రోడ్డులోని కాకతీయ జంక్షన్‌లోగల అంబేద్కర్ విగ్రహానికి రాజకీయ పార్టీల నాయకులు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్వాసితుల సంఘం నాయకులు పూలమాలలు వేసి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం మహా పాదయాత్ర బయలుదేరింది. కాకతీయ జంక్షన్ నుంచి కొత్త గాజువాక మీదుగా, పాత గాజువాక చేరింది. పాత గాజువాక జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు', ఉక్కు పరిశ్రమ జోలికొస్తే ఊరుకోం' అంటూ నినాదాలు చేశారు. ఈ మహా పాదయాత్రలో ఆరేళ్ల చిన్నారుల నుంచి 60 ఏండ్లకుపైబడిన ముసలివాళ్ల వరకూ పాల్గొన్నారు. కొంతమంది మహిళలు చంటి పిల్లలను చంకలో పెట్టుకొని ఈ మహా పాదయాత్రలో కలిసి వచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు, వివిధ కాలనీలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వల్లే గాజువాక అభివృద్ధి చెందిందని నినదించారు. చినుకులు పడుతున్నా లెక్క చేయకుండా మహా పాదయాత్ర కొనసాగింది. మహా పాదయాత్ర ప్రారంభంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు రవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.671 కోట్ల లాభాలు వచ్చేటట్లు లెక్కలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్లాంట్‌ను ఏ విధంగా ప్రయివేటీకరిస్తారని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. ఉద్యమాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, గాజువాక, అనకాపల్లి ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, బొడ్డు పైడిరాజు, నీరుకొండ రామచంద్రరావు, నిర్వాసితుల సంఘం నాయకులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.