Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు రెండు కాలేజీల ఏర్పాటంటూ ప్రచారాలు
- తప్పని రుజువు చేసిన కేంద్ర గణాంకాలు
- కాషాయపార్టీ తీరుపై విద్యావేత్తలు, నిపుణుల ఆగ్రహం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్య వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒక పక్క కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు విద్య కాషాయీకరణతో పాటు ప్రయివేటీకరణకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ నాయకులు మాత్రం దేశంలో విద్యాసంస్థల ఏర్పాటు విషయంలో మోడీ ప్రభుత్వం చాలా సాధించిందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలతో బీజేపీ నాయకులు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యావేత్తలు, నిపుణులు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిన సమాచారం.. బీజేపీ నాయకులు చేసే ప్రచారాలు నిజాలు కావన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం 2014 నుంచి రోజుకు రెండు కళాశాలలను ఏర్పాటు చేసిందంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం. '' ఉన్నత విద్యపై దృష్టి పెట్టిన మోడీ ప్రభుత్వం.. 2014 నుంచి రోజుకు రెండు కాలేజీలను ఏర్పాటు చేసింది. తొలి ఫోరెన్సిక్ యూనివర్సిటీ, రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ లను కేంద్రం ఏర్పాటు చేసింది'' అంటూ బీజేపీ.. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టింది. అయితే, కేంద్రం అధికారిక గణాంకాలు వారి వాదనలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు విద్య సంస్థల ఏర్పాటునూ మోడీ ఖాతాలో వేస్తూ కాషాయపార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యావేత్తలు, నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సర్వే సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 30, 2013 నుంచి సెప్టెంబర్ 30, 2019 మధ్య దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు 72 మాత్రమే కావడం గమనార్హం. ఇందులో ఐదు కేంద్ర విశ్వవిద్యాలయాలు కాగా, 67 మాత్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఐఎన్ఐ లు) కావడం గమనార్హం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ( మే 26, 2014 నుంచి) సెప్టెంబర్ 30, 2019 వరకు మొత్తం 1953 రోజులు ఉన్నాయి. అయితే, బీజేపీ చెప్పిన విధంగా రోజుకు రెండు విద్యాసంస్థల ఏర్పాటు జరిగి ఉంటే ఇన్ని రోజుల్లో దేశంలో 3,906 కాలేజీల ఏర్పాటు జరిగి ఉండాలనీ, కానీ అలా జరగలేదన్న విషయాన్ని నిపుణులు గుర్తుచేశారు. సెప్టెంబర్ 30, 2013 నాటికి యూపీఏ హయాంలో దేశంలో మొత్తం 36,634 కాలేజీలున్నాయి. సెప్టెంబర్ 30, 2019 నాటికి మోడీ ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 42,343కు చేరడం గమనార్హం. అయితే, ఇందులో అధికం రాష్ట్రాలు, ప్రయివేటు యాజమాన్యాలు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలే అధికంగా ఉన్నాయి. గత ఆరేండ్లలో దేశంలో ఏర్పాటైన ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య 1335గా ఉన్నది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నది. అయితే, బీజేపీ ఇకనైనా అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకొని నిజాలను ప్రజలకు తెలపాలని విద్యావేత్తలు, నిపుణులు తెలిపారు.