Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 ఏండ్ల జాప్యం వెనుక పాలక పార్టీల కుట్ర
- బిల్లు ఆమోదానికి ఎలాంటి అడ్డంకుల్లేవు : ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
న్యూఢిల్లీ : మహిళ రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ఆమోదించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మహిళ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి 25 ఏండ్లు అయిన సందర్భంగా ఆదివారం నాడిక్కడ స్థానిక కాన్స్టిట్యూషన్ కబ్ల్లోని స్పీకర్ హాల్లో దేశంలో మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నతొమ్మిది మహిళా సంఘాలు 25 ఏండ్ల పోరాటం-మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలనే డిమాండ్ చేస్తూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ 25 ఏండ్ల కిందట 1996 సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టిన పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ తదుపరి సెషన్లోనే లోక్‌సభలో ఆమోదించాలని డిమాండ్ చేశారు. 25 ఏండ్ల సుదీర్ఘ జాప్యంలో పాలక రాజకీయ పార్టీలు కుట్ర చేశాయని ఆరోపించారు. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నదనీ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ గతంలో చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు. మహిళలకు మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ఇవ్వడంతో ఈ బిల్లు ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బిల్లును తప్పనిసరిగా లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం ఒక ముఖ్యమైన దశ అని, కానీ ఇది లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి 11 ఏండ్ల పాటు వేచి చూస్తున్నామని అన్నారు. ఇది చాలా ఎక్కువ సమయమనీ, ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొంది, కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం పొందితే తప్ప అది చట్టంగా మారదని అన్నారు.
మహిళ రిజర్వేషన్ బిల్లుపై చిత్తశుద్ధి లేదు :కవితా కృష్ణన్
ఏఐపీడబ్ల్యూఏ నేత కవితా కృష్ణన్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్ బిల్లుపై పాలకులకు చిత్తశుద్ది లేదని అన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. మహిళా సమస్యలు పట్టని మోడీ సర్కార్, మహిళలను తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు.ఈ బిల్లు ఆమోదం పొందితే, పంచాయితీలు, స్థానిక సంస్థలలో మహిళలకు తప్పనిసరి రిజర్వేషన్ అమలు అయితే గ్రామాలు, చిన్న పట్టణాలు, నగరాల్లోని లక్షలాది మంది మహిళలు రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి దోహదపడుతుందని అన్నారు. తత్ఫలితంగా అధిక సంఖ్యలో మహిళలు మొదటిసారిగా ప్రజా రంగంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందని అన్నారు.
మహిళ సమస్యలు అజెండాలోకి వస్తాయి : అనీరాజా
ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు దేశంలోని సర్పంచులు, పంచాయితీ సభ్యులు, బీడీసీ సభ్యులు, జేడ్పీ ఛైర్పర్సన్లు, సభ్యులు, టౌన్ ఏరియా చైర్పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లుగా తమ బాధ్యతలను చురుకుగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వారు ఎన్నికల పోటీలో ప్రవేశించడానికి విపరీతమైన అసమానతలను ఎదుర్కొన్నారని, వారిలో చాలామంది మహిళలందరికీ ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇది పంచాయితీలు, స్థానిక సంస్థల ఎజెండాలోకి అనేక ముఖ్యమైన మహిళా సమస్యలను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ సానుకూల అనుభవాన్ని బలోపేతం చేయాలని, మరింత విస్తరించాలని అన్నారు.
ఏదో ఒక సాకు చూపి నిలిపివేశాయి : భాషా సింగ్
సీనియర్ జర్నలిస్టు భాషా సింగ్ మాట్లాడుతూ వరుసగా వచ్చిన ప్రభుత్వాలు గత 25 ఏండ్లుగా ఏదో ఒక సాకుతో బిల్లును నిలిపివేశాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం కేవలం 33 శాతం మాత్రమే కాదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. కానీ ఆ వాగ్దానం కేవలం జుమ్లాగా మారిందని పేర్కొన్నారు. మహిళల రిజర్వేషన్లపై దాడి చేస్తూ మహిళలను ఎప్పటికీ స్వేచ్ఛగా వదలకూడదని, ఎల్లప్పుడూ పురుషుడి నియంత్రణలో ఉండాలని మనుస్మతి ప్రిస్క్రిప్షన్‌ను ఉటంకిస్తూ ప్రముఖ బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ ఒక వ్యాసం రాశారని గుర్తు చేశారు. అదే ప్రస్తుత పాలకులకు మహిళలపై ఉన్న అభిప్రాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏకాభిప్రాయం లేకుండా వివాదాస్పద కార్మిక కోడ్, రైతు చట్టాలను ఏలా ఆమోదించారు?: అభిరామి జోతీశ్వరన్
ఏఐడీఎంఎఎం నేత అభిరామి జోతీశ్వరన్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో పెట్టకపోవడానికి ''ఏకాభిప్రాయం లేకపోవడం'' అని ప్రభుత్వం సాకుగా చూపుతుందని అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు ఏకాభిప్రాయం లేదని చెప్పే మోడీ సర్కార్, ఏకాభిప్రాయం లేకుండా వివాదాస్పద కార్మిక కోడ్, మూడు వ్యవసాయ చట్టాలను ఎందుకు ఆమోదించిందని ప్రశ్నించారు.
అన్ని రాజకీయ పార్టీలూ కలిసి రావాలి : షబ్నం హష్మి
ఏఎన్హెచ్ఎడి నేత షబ్నం హష్మి మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. 33 శాతం రిజర్వేషన్లోపు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎల్బీటీక్యూ వంటి అట్టడుగు వర్గాలను చేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. బిల్లును వ్యతిరేకించే అన్ని శక్తులకు భయాలను తొలగించాలని, మన దేశంలో మహిళల హక్కులు, సమానత్వానికి మద్దతు ఇవ్వాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఈ సభలో డీడబ్ల్యూసీ నేతలు సీమా జోషి, మాధురి వర్ష్నీ, ఎండబ్ల్యూఎఫ్ నేత సయ్యదా హమీద్, పెహ్చన్ నేత ఫరీదా ఖాన్, వైడబ్ల్యూసీఏ నేత పూజ మండలం తదితరులు మాట్లాడారు. గ్రాఫిక్ డిజైనర్లు అరిత్రి దాస్, అశుతోష్ భరద్వాజ్, షణ్ముఖ్, పర్వేజ్ రాజన్, వంశిక బబ్బర్, ఉత్తమ్ ఘోష్, ఆన్ డొమినిక్, సిరావోన్ ఖాతింగ్, నేహా రమేష్, క్రిస్ ఫ్రిట్జ్, సమర నికోలస్, హ్యూన్సోక్ కిమ్, కిరణ్, రోషన్ ఎడ్డి, శ్రీవాస్తవ యాబ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లు, మహిళల పోరాటానికి 25 ఏండ్లు అయిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్లను రూపొందించిన ప్రఖర్ శ్రీవాస్తవ, జోరమేని, బిజిత్ బరత్, మిచెల్ మాల్, సౌమ్య తదితరులను మహిళ సంఘాల నేతలు అభినందించారు.