Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ఏడాది లాక్డౌన్తో కష్టాలు మొదలు
- ఉపాధి, ఆదాయం కోల్పోతున్న మహిళా రైతులు, రైతు కూలీలు
- రెండో వేవ్ తర్వాత అప్పుకూడా పుట్టడం లేదు : 'ఇండియా స్పెండ్' అధ్యయనంలో పరిశోధకులు
- నగరాలు, పట్టణాల నుంచి తిరిగి వలసలతో పరిస్థితి తారుమారు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, లాక్డౌన్ విధింపు తర్వాత గ్రామీణ ప్రాంతా ల్లో మహిళా రైతులు, రైతు కూలీల పరిస్థితి తారుమారు అయ్యింది. వ్యవ సాయ పనులకు పోటీ పెరగటం మహిళల ఉపాధిపై తీవ్ర ఉపాధి చూపిం దని 'ఇండియా స్పెండ్' అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో గ్రామాలకు తిరిగి రావటంతో అక్కడ మహిళా రైతు కూలీలకు డిమాండ్ పడిపోయిందని, దాంతో వారి ఆదాయం గణనీయంగా దెబ్బతిన్నదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చాలా గ్రామాల్లో మహిళా కూలీలను పనికి పిలవటం లేదని, ఒకవేళ పని కావాలని కోరితే..రూ.100తో రోజు కూలీ చేయించుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాకు చెందిన మహిళా రైతు కూలీ చాందీ బాయీ మాట్లాడుతూ..''లాడ్పూర్లో కొంత భూమి ఉంది. నేనూ రైతునే. అయితే వ్యవసాయంపై ఆదాయం లేక..కూలి పనులకు కూడా వెళ్తాను. నాలాంటి మహిళలెంతో మంది కూలి పనులకు వెళ్తున్నారు. అయితే లాక్డౌన్ తర్వాత పరిస్థితి తలకిందులైంది. కూలి రేట్లు దారుణంగా తగ్గించేశారు. అసలు పనికే పిలవటం లేదు. గతంలో కూలి పనికి పోతే రోజుకు రూ.200 వచ్చేది. ఇప్పుడు రూ.100 కూడా రావటం లేదు. మా కుటుంబాలు గడవటం చాలా కష్టంగా మారింది'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
పని ఇచ్చేవారే లేరు : రేణు భోగాల్, ఆక్స్ఫామ్ ఇండియా
వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల్లో అత్యధికశాతం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. వీరంతా లాక్డౌన్ తర్వాత తమ తమ స్వగ్రామాలకు వలస వెళ్లారు. దాంతో గ్రామాల్లో వ్యవసాయ పనులకు పోటీ పడేవారు అనూహ్యంగా పెరిగారు. పెద్ద సంఖ్యలో మగ కార్మికులు పనికోసం అడ్డాకు చేరుకున్నారు. మహిళా కూలీలకు పని ఇచ్చేవారు కరువయ్యారు. దాంతో ఆ రాష్ట్రాల్లో కుటుంబాల ఆదాయమూ ప్రభావితమైంది.
ఉపాధి కోల్పోయిన వారి వివరాల్లేవు : మహేశ్ వ్యాస్
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయి. సంక్షోభ సమయాన వ్యవసాయరంగంలో వృద్ధి 3.4శాతం నమోదైంది. రికార్డుస్థాయిలో పంట దిగుబడి వచ్చింది. అయితే వ్యవసాయరంగంపై ఆధారపడ్డ మహిళా రైతులు, రైతు కూలీల ఆదాయంలో మాత్రం మార్పు రాలేదు. సంక్షోభం కారణంగా వారి ఆదాయం దారుణంగా పడిపోయింది. సాగుకాలంలో ఉపాధి పొందేవారి సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఎంతో మంది మహిళా కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయిన సంగతి గణాంకాల్లో కనపడటం లేదు.
మరికొన్ని..
- బీహార్లోని 5 జిల్లాల్లో సర్వే చేయగా, లాక్డౌన్ కారణంగా మార్కెట్కు వెళ్లి పంటను అమ్ముకోలేకపోయామని 90శాతం మంది మహిళా రైతులు చెప్పారు.
- సర్వేలో 711 మంది మహిళా రైతుల నుంచి పలు వివరాలు సేకరించగా, గతంలో తీసుకున్న రుణాలు తీర్చలేకపోయామని 352 మంది మహిళా రైతులు చెప్పారు.
- వ్యవసాయ పనుల లేక తాము పొదుపు చేసుకున్న డబ్బులు ఖర్చు చేశామని, కొత్త రుణాలేవీ రాలేదని మహిళలు చెప్పారు.
- ఇక రెండో వేవ్ వచ్చాక..తమకు కనీసం అప్పుకూడా పుట్టడం లేదని మహిళలు సమాధానమిచ్చారు. కారణం తమకు వ్యవసాయ పనులేవీ దొరకనందువల్లే అప్పు ఇవ్వడం లేదని వారు చెప్పారు.