Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 ఏండ్ల మహిళ మృతి
- ఎస్హెచ్ఓ, ఐఓ సస్పెండ్
పాట్నా : నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించి వేధించడంతో బీహార్‌లోని ఒక పోలీస్ లాకప్‌లో 50 ఏండ్ల మహిళ మృతి చెందింది. ఈ మరణంపై ఆందోళనలు వెళ్లువెత్తడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), విచారణాధికారి (ఐఓ)ను అధికారులు సస్పెండ్ చేశారు. భోజ్‌పూర్ జిల్లాలోని పిరో పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. మంతోష్‌కుమార్ అర్యా అనే ఆర్ఎంపీ హత్య కేసులో ఈ మహిళతో పాటు, ఆమె కుమారుడు, ముగ్గురు కజిన్లను పోలీసులు ఈ నెల 8న అదుపులోకి తీసుకున్నారు. అప్పట్ని నుంచి లాకప్‌లోనే ఉంచి విచారిస్తున్నారు.ఈ క్రమంలో ఆదివారం టాయిలెట్ పక్కన మహిళ ఉరి వేసుకుందని, దీన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులు వేధింపులతోనే మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు సోమవారం ఉదయం నుంచి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. వీరికి సీపీఐ(ఎం), ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఎలాంటి నేర చరిత్ర లేని మహిళను నిర్భంధించి వేధించడం పోలీసుల విధి కాదని సీపీఐ(ఎం) విమర్శించింది. పోలీస్ స్టేషన్ చీఫ్, విచారణ అధికారిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), విచారణాధికారి (ఐఓ)ను భోజ్‌పూర్ ఎస్పి వినరు తివారీ సస్పెండ్ చేశారు. అలాగే సంఘటనాస్థలానికి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. చట్ట ప్రకారం విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.