Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) నుంచి తమిళనాడు విద్యార్థులకు ఉపశమనం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో సోమవారం నీట్ వ్యతిరేక బిల్లును ఆమోదించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఆమోదం తెలిపాయి. ఇంటర్మీడియెట్ (10+2) బోర్డు పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని బిల్లులో కోరారు. తమిళనాడులో ఇంతకు ముందు(నీట్ రాకముందు) 10+2 మార్కుల ఆధారంగానే ప్రవేశాలు జరిగేవని తెలిపారు. సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నీట్ పరీక్ష జరుగుతోందని, దీనికి తమిళనాడు ఇంటర్ సిలబస్‌కు తేడా ఉండటంతో రాష్ట్రంలోని విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా ముందున్న వర్గాలకు నీట్ పరీక్షా విధానం అనుకూలంగా ఉందని సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని సేలం జిల్లాలో నీట్ పరీక్షకు ముందు 20ఏండ్ల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అనంతరం దీనిపై తమిళనాడు ప్రభుత్వం బిల్లు రూపొందించింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ..''మీరు (ఏఐఏడీఎంకే) కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. సీఏఏ, వ్యవసాయ చట్టాల విషయంలో మీరు ఏమీ చేయలేదు. నీట్ విషయంలో అయినా కొన్ని షరతులు పెట్టి ఉండాల్సింది. కానీ మీకు గొంతులు పెంచేంత ధైర్యం లేదు. ఆశావాహులు చనిపోతుంటే మీరు మౌనంగా ఉన్నారు'' అని అన్నాడీఎంకే నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నీట్‌ను రద్దు చేయడానికి ప్రభుత్వం దశల వారీగా కృషి చేస్తోందని స్టాలిన్ అన్నారు.