Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కాంగ్రెస్‌ను వీడేందుకు బీజేపీ తనకు భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేసిందని ఖగ్వాడ్ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఒక్కపైసా కూడా తీసుకోకుండా బీజేపీలో చేరాననీ, బదులుగా మంత్రి పదవి అడిగానని అన్నారు. అయితే ప్రస్తుత క్యాబినెట్లో ప్రభుత్వం తనకు మంత్రి పదవి కట్టబెట్టలేదని.. తరువాతి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని హామీ ఇచ్చారని అన్నారు. రెండేండ్ల క్రితం 'ఆపరేషన్ కమలం' పేరుతో కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమేనని ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు స్పష్టంచేశాయి. కర్నాటక కాంగ్రెస్‌లో బాలాసాహెబ్ సీనియర్ నేతగా ఉన్నారు. 2019లో హెచ్డి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు.. బీజేపీ గూటికి చేరిన 16 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో బాలాసాహెబ్ కూడా ఉన్నారు. అనంతరం యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన క్యాబినెట్లో బాలాసాహెబ్‌కు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే ఇటీవల యడియూరప్ప రాజీనామా చేయడంతో బసవరాజు బమ్మై సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన క్యాబినెట్లో బాలాసాహెబ్‌కు చోటు దక్కలేదు. దీంతో బీజేపీ అధిష్టానంపై అసంతప్తితో రగిలిపోతున్న ఆయన ఆదివారం మీడియా సమావేశంలో ఆవేదన వెళ్లగక్కారు. ఆనక నాలిక్కరుచుకుని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ యూటర్న్ తీసుకున్నారు. కాగా, ఈ అంశంపై కాంగ్రెస్ నేత డికె శివకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 'ఆపరేషన్ కమలం' లో భాగంగా పాటిల్‌కు డబ్బు ఆశచూపి బీజేపీలోకి తీసుకున్నారని.. ఇప్పుడైనా ఆయన నిజం చెప్పినందుకు సంతోషమని అన్నారు. దీనిపై ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని శివకుమార్ ట్వీట్ చేశారు. కర్నాటకలో సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైనట్టు సమాచారం.