Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ ఆర్టీసీ ఒప్పంద కార్మికులు హెచ్చరిక
చంఢగీఢ్ : తమ సమస్యల పరిష్కారం జరగకపోతే 15న జాతీయ రహదారులను దిగ్భంధిస్తామని పంజాబ్ రోడ్డు రవాణా (పీఆర్టీసీ), పంజాబ్ రోడ్ వేస్ (పీయూఎన్బీయూఎస్) ఒప్పంద కార్మికులు హెచ్చరించారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని, రాష్ట్రంలో రవాణా సమస్యలు తీర్చాలని ఒప్పంద కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె రెండో వారంలోకి ప్రవేశించింది. సోమవారం రాష్ట్రంలో బస్ డిపోలు ఉన్న 27 నగరాల్లో నిరసన మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒప్పంద కార్మికుల యూనియన్ కార్యదర్శి గుర్ప్రీత్ సింగ్ పన్ను మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. మంగళవారం మరోసారి ప్రభుత్వ అధికారులతో సమావేశం జరగాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 15న జాతీయ రహదారుల దిగ్భంధం కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. పీఆర్టీసీ, పీయూఎన్బీయూఎస్కు చెందిన సమారు 8 వేల మంది ఒప్పంద కార్మికుల సమ్మె కారణంగా ఈ నెల 6 నుంచి కనీసం 2,400 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. సమ్మె చేస్తున్న వారిలో డ్రైవర్లు, కండక్టర్లు, క్లర్కులు, బుకింగ్ సిబ్బంది ఉన్నారు. సమ్మెతో ప్రజలు ఇబ్బందు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.