Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులను ప్రశ్నించిన కోర్టు
న్యూఢిల్లీ : గతేడాది ఢిల్లీలో మత ఘర్షణల సందర్భంగా చెలరేగిన హింసలో వచ్చిన పలు ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ఒకే ఎఫ్ఐఆర్ను రూపొందించడంపై పోలీసులను ఢిల్లీ కోర్టు ప్రశ్నించింది. దాంతో ఈ కేసుల్లోని చార్జిషీట్లను వేరుచేసి విడిగా అందచేయాలని పోలీసులు నిర్ణయించారు. అల్లర్లు, దొంగతనం, గృహ దహనాలకు సంబంధించిన ఐదు సంఘటనలు ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో సి, డి, ఇ బ్లాకుల్లో వేర్వేరుగా చోటు చేసుకుంటే అన్నింటినీ కలిసి ఒకే ఎఫ్ఐఆర్, చార్జిషీట్‌గా ఎందుకు రూపొందించారని అదనపు సెషన్స్ న్యాయమూర్తి వినోద్ యాదవ్ పోలీసులను ప్రశ్నించారు. భజన్‌పురా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ నెల 10న దీనిపై స్టేటస్ నివేదికను కోర్టుకు అందచేశారు. డి, ఇ బ్లాకుల్లో జరిగిన అల్లర్ల ఫిర్యాదులపై విడివిడిగానే దర్యాప్తు జరిగిందని చెప్పారు. ఈ మూడు సంఘటనలపై విడిగా చార్జిషీట్లు దాఖలు చేస్తామని తెలియచేశారు. దానికి కోర్టు అంగీకరించింది. ఇక దీనితో పాటు సి బ్లాకులో జరిగిన అల్లర్లకు సంబంధించిన రెండు ఫిర్యాదుల్లో అందచేసిన చార్జిషీట్‌ను పరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలు చెలరేగాయి. పౌరసత్వ సవరణ బిల్లును నిరసించేవారు, మద్దతిచ్చే వారి మధ్య ఘర్షణలు చెలరేగడంతో 53మంది మరణించగా, 700మందికి పైగా గాయపడ్డారు. పైగా ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన చాలా కేసుల్లో దర్యాప్తు ప్రమాణాలు చాలా పేలవంగా వున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అభియోగాలను రూపొందిస్తూ, సెషన్స్ న్యాయమూర్తి నిందితులపై గృహ దహనాల ఆరోపణలను కొట్టిపారేశారు. నేరం జరిగినట్లు దుకాణాదారులు ఆరోపించలేదని, పైగా సిసిటివి ఫుటేజ్ కూడా లేదని అన్నారు.