Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూయాజమాన్య పత్రాల పంపిణీ : సీఎం విజయన్
తిరువనంతపురం : భూమి లేని నిరుపేదలకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని భూమిలేని, వెనుకబడిన వర్గాలకు ప్రజలందరికీ భూమి, గహ సదుపాయాన్ని అందించేందుకు తీసుకున్న ప్రణాళికలో భాగంగా 13,500 కుటుంబాలకు మంగళవారం భూయాజమాన్య హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం పేస్బుక్ పోస్టు ద్వారా వివరాలు వెల్లడించారు. భూపంపిణీ కోసం 14 జిల్లా కేంద్రాలతో పాటు 77 తాలూకా కేంద్రాల్లో 'పట్టాయం మేలా' నిర్వహిస్తామని తెలిపారు. రానున్న ఐదేండ్లలో అర్హులందరికీ భూపంపిణీ చేయాలని అదేవిధంగా ఎస్సీ కుటుంబాలకు గృహ సదుపాయం కల్పించాలన్న ముఖ్యమైన లక్ష్యాన్ని తమ ప్రభుత్వం నిర్దేశించుకుందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు అందించే పథకం, భూమిలేని వారికి భూపంపిణీని మరింత విస్తరిస్తామని తెలిపారు. గిరిజన కుటుంబాలన్నింటికీ ఒక ఎకరా భూమి ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పోస్టులో పేర్కొన్నారు. గిరిజనుల భూ సమస్యల పరిష్కారానికి వథా భూమి, మిగులు భూమి, కౌలు తోటలను ఉపయోగిస్తామని, అలాంటి బలహీన వర్గాలను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని విజయన్ అన్నారు.ప్రారంభ లక్ష్యంలో భాగంగా 12 వేల కుటుంబాలకు భూపంపిణీ చేయాలని నిర్దేశించుకున్నామనీ, అయితే కేటాయింపు ప్రక్రియలో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో ఇప్పుడు 13,500 కుటుంబాలకు భూయాజమాన్య పత్రాలు ఇస్తున్నామని విజయన్ తెలిపారు. భూబదిలీకి ప్రత్యేక ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు డిజిటల్ సర్వే నిర్వహిస్తామని, ఇందుకు 'రీబిల్డ్ కేరళ' కార్యక్రమం కింద మొదటి విడతలో భాగంగా రూ.339 కోట్లు విడుదల చేశామని, ఈ సర్వే నాలుగేళ్లలో పూర్తవుతుందని అశిస్తున్నామని విజయన్ పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా భూనిర్వాసితులకు పంపిణీ చేసేందుకు అనుకూలమైన భూమిని గుర్తిస్తామని ఆయన చెప్పారు. మిగులు భూమి, చట్టవిరుద్ధంగా ఉన్న భూమిని గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని విజయన్ పేర్కొన్నారు. గత ఎల్డీఎఫ్ ప్రభుత్వ హయాంలో సాంకేతిక, చట్టపరమైన అడ్డంకుల కారణంగా భూయాజమాన్యాన్ని కోల్పోయిన పెద్ద సంఖ్యలో ప్రజలకు భూమిని కేటాయించామని, 2016, 2021 మధ్య 1.75 లక్షల పట్టాలు మంజూరు చేశామని, ఇది కేరళలో ఆల్ టైమ్ రికార్డ్ అని ఆయన అన్నారు.