Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద సాయం వదిలి సీఎం ప్రమాణస్వీకారంలో అమిత్ షా బిజీ..బిక్కుబిక్కుమంటున్న జనం..
- 18 జలప్రాజెక్టులకు చేరిన వరదనీరు
- 35 గ్రామాలకు తెగిన సంబంధాలు
జామ్‌నగర్ : మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో జనం భయం..భయంగా బతుకుతున్నారు.ఎప్పుడు జలప్రళయంగా మారుతున్నదోనంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో 18 జలప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతున్నది. 35 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇక జామ్‌నగర్‌లోని అనేకప్రాంతాల్లో ఎనిమిది అడుగులకుపైగా నీరు చేరింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవటానికి ఇండ్లపైకి ఎక్కి..జనం తమను కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. పలుచోట్ల వీధుల్లో పడవలు పెట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి జనం జలదిగ్బంధనం చిక్కుకుంటే...కేంద్రహౌంమంత్రి అమిత్‌షా వరదసహాయక పనులగురించి చర్చించకుండా..గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ ప్రమాణస్వీకారంలో బిజీ అయిపోవటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
నగరాలను ముంచెత్తిన వరద
భారీ వర్షాలతో గుజరాత్లో ఎటు చూసినా వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా రాజ్‌కోట్, జామ్‌నగర్ ప్రాంతాల్లోని జనం బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. జామ్‌నగర్ జిల్లాలోని భానుగర్ గ్రామంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజ్‌కోట్‌లోనూ ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ఈ ప్రాంతాల్లో పది అడుగులమేర నీరు ప్రవహిస్తున్నది. జునాగఢ్‌లో కూడా ఆరు సెంటీమీటర్ల వర్షం పడింది. వరదలతో సోన్రాఖ్ కాల్వ నదులు వరదలకు కారణమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని అనేక ఇండ్లు నీట మునిగాయి. అగ్నిమాపక దళం, పోలీసు బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సహాయం కోసం ఇతర జిల్లాల నుంచి బృందాలను పంపాలని స్థానిక అధికారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మూడు గ్రామాల్లో వరదలు అత్యంత విధ్వంసం సృష్టించాయి.
రంజిత్ సాగర్ డ్యామ్ నింపడం వల్లే కష్టాలు..
గత ఐదు రోజులుగా గుజరాత్ లోని సౌరాష్ట్రలో భారీ వర్షం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రంజిత్ సాగర్ డ్యామ్ నింపటం వల్లే వరద ముంచెత్తిందని స్థానికులు చెబుతున్నారు.
24గంటల్లో జంషేడ్‌పూర్,జోడియాలో కురుసున్న వర్షాలకు వొక్రా నది పొంగిపొర్లుతున్నది. దీంతో హైవే మునిగిపోయింది. ఈ కారణంగా జామ్‌నగర్-కలవాడ్ హైవే మూసివేశారు.రాజ్‌కోట్‌లోని మహాకల్ చౌక్‌లో అనేక ఇండ్లు నీట మునిగాయి.
కాపాడండి...
జామ్‌నగర్‌లోని రహదారులు మూడు అడుగులకు పైనే వరద నీటిలో మునిగిపోయాయి.లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా మారింది.తమ ప్రాణాలను కాపాడాలంటూ.. పైకప్పులపై బిగ్గరగా అరుస్తున్నారు.ఇప్పటి వరకు కేవలం 230 మందిని మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించగా, భారీసంఖ్యలో ప్రజలు ఇంకా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.