Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్థాయిలో పడిపోయిన ధరలు
- పంటకు కనీస మద్దతు ధర కరువు.. 50కిలోల బస్తా ధర రూ.260
కోల్కతా : దేశంలో బీజేపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వ పలు నిర్ణయాలతో రైతుల పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇప్పటికే పండించిన పంటకు మార్కెట్లో సరైన ధర దక్కకపోవడం, ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరలు అందకపోవడం, ఆకల పరిస్థితులు, ఎరువులు, విత్తనాలు సహా ఇతర పెట్టుబడి ఖర్చులు సైతం భారీగా పెరుగుతుండటంతో రైతులు రుణ ఊబిలోకి జారుకుంటున్నారు. ప్రస్తుతం బెంగాల్ బంగాళదుంప రైతుల పరిస్థితులు మరింతగా దిగజారాయి. మార్కెట్లో బంగాళదుంప ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. 50 కిలోలు బస్తాకు కేవలం రూ.260లు పలుకుతోంది. పెట్టుబడులు అధికం కావడం, ప్రభుత్వ మద్దతు ధర సైతం లేకపోవడంతో రైతులు మరింతగా దెబ్బతింటున్నారు. ఒక కిలో బంగాళాదుంపకు కోల్డ్ స్టోరేజీ ధర ప్రస్తుతం రూ.5.20గా ఉండగా, బహిరంగ మార్కెట్ ధర కిలోకు రూ.14-15గా ఉంది. గత కొన్నేండ్లుగా ఉత్పత్తి ఖర్చులు సైతం పెరుగుతుండటంతో రైతులు భారీ నష్టాలను గురవుతున్నారు.
పుర్బా బర్ధమాన్ జిల్లాలోని మెమారికి చెందిన బంగాళాదుంప రైతు బిస్వరూప్ మోండల్ మాట్లాడుతూ.. ఒక బిఘా భూమిలో బంగాళాదుంప పంటకు ఉత్పత్తి ఖర్చు రూ.32,000 అవుతోంది. అయితే, ప్రస్తుతం బెంగాల్లో రైతులు తమ ఉత్పత్తులను విక్రయించిన తరువాత రూ.20,800 పొందుతున్నారు. అంటే సుమారు రూ.11,200 నష్టాన్ని రైతులకు కలిగిస్తుంది. అదే ఐదు బిఘాల భూమి రూ.56,000 నష్టా న్ని చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉండగా, బంగాళదుంప రైతులకు ప్రభుత్వం నుంచి రూ.2,500 మాత్రమే పరిహారం అందితోంది. రైతులు బంగాళదుంపకు కనీస మద్ధతు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2010లో మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ధరలు పడిపోతే.. రాష్ట్రంలో అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం రైతుల నుంచి బంగాళదుంపను కొనుగోలు చేసిందనీ, సహాయ చర్యలకు రూ.700 కోట్లు ఖర్చు చేసిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ సర్కారు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పంటకు బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు.. పంటకొనుగోలును పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, దేశంలో యూపీ తర్వాత బెంగాల్లోనే అత్యధికంగా బంగళదుంపను సాగుచేస్తున్నారు.