Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకం అమల్లో అవకతవకలు జరిగాయి : ఆర్టీఐ కార్యకర్తలు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ సమయాన మోడీ సర్కార్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 'పీఎం గరీబ్ కల్యాణ్ యోజన'. గత ఏడాది ఈ ప్యాకేజీ కింద పేదలు, అణగారిన వర్గాల్లోని 20కోట్ల మందికిపైగా మహిళలకు రూ.1500 అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనిని మూడు దఫాలుగా రూ.500 లబ్దిదారులైన మహిళల జనధన్ బ్యాంక్ ఖాతాల్లో వేశామని కేంద్రం ఇటీవల వెల్లడించింది. అయితే ఈ పథకం అమలుపై ఆర్టీఐ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ విడుదల చేసిన సమాచారంలో చాలా తేడా కనపడుతోందని, గ్రామీణ అభివృద్ధి శాఖ విడుదలచేసిన దాంట్లో 2.53 కోట్లమంది లబ్దిదా రులైన మహిళల వివరాలు సరిగాలేవని ఆర్టీఐ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
గరీబ్ కల్యాణ్ యోజన అమలుకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్తలు సరైన సమాచారాన్ని విడుదల చేయాలని గత ఏడాదికాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. ఎన్నోమార్లు ఆర్టీఐ దరఖాస్తులు చేసుకున్నా సమాచారం విడుదల చేయటం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రధాని కార్యాలయం, కేంద్ర ఆర్థికశాఖ వివిధ సందర్భాల్లో విడుదల చేసిన సమాచారం, ఆర్టీఐ దరఖాస్తుకు గ్రామీణ అభివృద్ధి శాఖ విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషించగా...పథకం అమల్లో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆర్టీఐ కార్యకర్తలు తేల్చారు. అంతేగాక మరోక ముఖ్యమైన అంశం తెరపైకి వచ్చిందని వారు అంటున్నారు.
అదేంటంటే..'పీఎం గరీబ్ కల్యాణ్ యోజన' ప్యాకేజీ కోసం రూ.30వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని మోడీ సర్కార్ చెబుతోంది. ఇదంతా కూడా జన్‌ధన్ ఖాతాల్లో వేశామని ప్రధాని మోడీ ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రకటించారు. అయితే..ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి కేంద్రం ఈ మొత్తాన్ని అప్పుగా తీసుకుందని, తిరిగి ఇదంతా కూడా ప్రజల నుంచి పన్ను వసూళ్లతో రాబట్టుకొని అప్పు చెల్లిస్తారని ఆర్టీఐ కార్యకర్తలు చెబుతున్నారు.