Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది దేశ రక్షణకు సంబంధించినది : సుప్రీంకోర్టులో కేంద్రం
- దేశ భద్రత, రక్షణ అంశాలు అవసరం లేదు,
- వాడారా? లేదా? చెప్పండి.. : సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ వినియోగించారా? లేదా? అనేది..చెప్పలేమనీ, దీనిపై సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయలేమని సుప్రీంకోర్టులో కేంద్రం వెల్లడించింది. పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు అడిగిన దానిపై అఫిడవిట్ సమర్పించలేమని కేంద్రం చెప్పటం చర్చనీయాంశమైంది. అయితే పెగాసస్ కుంభకోణంలో ఆరోపణలపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ''పెగాసస్ అంశం అత్యంత ముఖ్యమైనదే. అయితే ఓ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగించిందా? లేదా? అన్నది బహిరంగంగా చర్చించే అంశం కాదు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ సమాచారాన్ని అఫిడవిట్లో పేర్కొనలేదు. అందువల్ల ఈ వ్యవహారంలో ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుంది. సవివరమైన అఫిడవిట్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలను బహిరంగపర్చలేమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పెగాసస్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటుంది. అన్నింటినీ పరిశీలించి కోర్టుకు నివేదిస్తుంది'' అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
సుప్రీం ధర్మాసనం అసంతృప్తి
కేంద్రం సమాధానంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము దేశ భద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి వెళ్లడం లేదని, రక్షణ విషయాలు అడగట్లేదని సీజేఐ అన్నారు. కేంద్రం పదేపదే అవే అంశాలను ప్రస్తావిస్తుందన్నారు. '' పెగాసస్ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. పౌరల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలు. ఇందులో గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలి. దీనిపై ఒక ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశమిచ్చాం. కారణం ఏదైనా ప్రకటన చేయడానికి కేంద్రం ఇష్టపడట్లేదు '' అని చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..పిటిషన్లపై రెండు, మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపింది. ఈలోగా కొత్త అఫిడవిట్ దాఖలు చేసే విషయంపై కేంద్రం పునరాలోచన చేయొచ్చని చెబుతూ తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.