Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్ లో డెంగీ కొత్త వేరియంట్ కలకలం
- పదుల సంఖ్యలో మరణాలు.. మృతుల్లో పిల్లలు కూడా
- చాపకింద నీరులా నెమ్మదిగా కబళిస్తున్న వైరస్ స్ట్రెయిన్
స్రవంతి
కరోనాతో కల్లోలమైన దేశాన్ని కొత్త రూపాల్లో 'డెంగీ' వణికిస్తున్నది. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఈ వ్యాధి విశృంఖలంగా విజృంభిస్తున్నది. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించారు. వందలాదిమంది దవాఖానల్లో చేరారు. మృతుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. డెంగీకి చెందిన 'డీ2 స్ట్రెయిన్' వల్లే ఈ వ్యాధి ప్రమాదకరంగా మారిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
ఏమిటీ డీ2 వేరియంట్?
తీవ్రతను బట్టి డెంగీ వైరస్ నాలుగు రకాలు. అవి డెన్వీ-1, డెన్వీ-2, డెన్వీ-3, డెన్వీ-4. యూపీలోని ఫిరోజాబాద్, ఆగ్రా, మథురా, అలీగఢ్ లో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు 'డెన్వీ-2'కి చెందినవని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాంభార్గవ తెలిపారు. ఇది వ్యాధి తీవ్రతకు, మరణాల పెరుగుదలకు కారణమవుతున్నట్టు పేర్కొన్నారు. ఇదివరకే డెంగీ సోకి నయమైనవారికి డెన్వీ-2 స్ట్రెయిన్ సోకొచ్చన్నారు.
'డీ2' ప్రమాదకరమా?
డెంగీ కారణంగా రోగులు తీవ్రమైన ఫ్లూ లక్షణాలబారిన పడినప్పటికీ, అవి బయటకు కనిపించకపోవచ్చు. సరైన సమయంలో చికిత్స అందించకపోతే బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ప్రస్తుతం తీవ్రమైన డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
'డీ2' లక్షణాలు ఏమిటి?
రోగి చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తపు వాంతులు, వేగవంతమైన శ్వాస, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. ప్లాస్మా లీకేజ్, తీవ్రమైన రక్తస్రావం జరగొచ్చు. వ్యాధి సోకిన 3 నుంచి 7 రోజుల్లోనే పరిస్థితి క్లిష్టంగా మారొచ్చు. బాధితుడిని వెంటనే దవాఖానలో చేర్పించి అత్యవసర చికిత్సనందించాలి.