Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 292 రోజు కొనసాగుతున్న రైతు ఉద్యమం
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 27 న భారత్ బంద్‌కు ముందు బెంగళూరులో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. భారత్ బంద్‌కు మద్దతుగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్ధాలోని మానిక్ చౌక్ వద్ద ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. దేశవ్యాప్తంగా భారత్ బంద్ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కిసాన్ సంవాద్ యాత్ర మహారాష్ట్రలో ఔరంగాబాద్ నుంచి ప్రారంభమైంది. యాత్ర సెప్టెంబర్ 21 వరకు మహారాష్ట్రలోని పట్టణాలు, గ్రామాల గుండా సాగుతుంది. మహారాష్ట్రలోని సెప్టెంబర్ 20 భారత్ బంద్ సన్నాహక సమావేశం జరగనుంది. మధ్యప్రదేశ్‌లో ఎస్కేఎం సమావేశంలో 26 రైతు సంఘాలు కలిసి భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మోటార్‌సైకిల్ ర్యాలీ, ప్రతి జిల్లాలో ఊరేగింపు జరుగుతుంది. వేలాది మంది రైతులు మంగళవారం సింఘు సరిహద్దుకు చేరుకున్నారు. మరోవైపు మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిరంతరాయంగా కొనసాగుతుంది. మంగళవారం నాటికి 292వ రోజుకు ఉద్యమం చేరుకుంది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్, పల్వాల్ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు బిజెపి, దాని మిత్ర పక్షాల నేతలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో బిజెపి నేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
నాలుగు రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన వల్ల ప్రతికూల ప్రభావంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. పారిశ్రామిక యూనిట్లు, రవాణా దెబ్బతినడంపై తమకు ఫిర్యాదులు అందాయని కమిషన్ తెలిపింది. ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల నిరసన కారణంగా పారిశ్రామిక యూనిట్లు, రవాణా ప్రభావితమవుతున్న ఫిర్యాదులపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు మంగళవారం జారీ చేసింది. కొనసాగుతున్న రైతుల నిరసనకు సంబంధించి అనేక ఫిర్యాదులను స్వీకరించామని, ఇందులో సుమారు 9,000 పారిశ్రామిక యూనిట్లు, రవాణా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. ''రవాణా ప్రతికూలంగా ప్రభావితమైందని, దీనివల్ల ప్రయాణికులు, రోగులు, శారీరక వికలాంగులు, వద్ధులు రోడ్లపై తీవ్ర రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేయబడ్డాయని కూడా నివేదికలు ఉన్నాయి'' అని ఎన్హెచ్ఆర్సీ ప్రకటన తెలిపింది.కమిషన్ నాలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తీసుకున్న చర్యలపై నివేదికలు ఇవ్వలని కోరింది. రైతులు రహదారి దిగ్బంధించడం వల్ల నివాసితులు తమ ఇండ్ల నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించడం లేదని ఆరోపణలు ఉన్నాయని, ఆందోళనలో మానవ హక్కుల సమస్య ఉన్నందున, శాంతియుతంగా ఆందోళన చేసే హక్కును కూడా గౌరవించాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. కమిషన్ వివిధ మానవ హక్కుల సమస్యల పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ప్రకటన పేర్కొంది.