Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘటిత పోరాటాలతో తరిమికొట్టాలి: బి.వి రాఘవులు
అమరావతి : అన్ని రంగాల్లోనూ మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకే ఆర్థిక వ్యవస్థ అడుగంటిపోయిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. కరోనా మహమ్మారి కన్నా పెద్ద ప్రమాదంగా దేశానికి బీజేపీ దాపురించిందని, దానిని తరిమికొడితేనే దేశం ముందుకు పోతుందని ఆయన చెప్పారు. 'బీజేపీ విధానాలను ప్రతిఘటించండి- దేశాన్ని రక్షించండి' అన్న నినాదంతో మంగళవారం విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) పశ్చిమ కృష్ణా జిల్లా కమిటీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం దేశానికే గాక ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా బీజేపీ తీరని ద్రోహం చేస్తున్నదని, అయినా, దానిని ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సిపి, టీడీసీలు ఎందుకు గట్టిగా వ్యతిరేకించలేకపోతున్నాయని ప్రశ్నించారు. మతతత్వ శక్తులకు తెలుగు గడ్డపై చోటివ్వరాదని విజ్ఞప్తి చేశారు . దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టాలన్నదే బీజేపీ లక్ష్యమని, ప్రజల సంక్షేమం కాదని అన్నారు. కోవిడ్‌ను అదుపు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందన్నారు. పొరుగునే ఉన్న చైనా 69శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్ వేయడమేనని చెప్పారు. అమెరికా కూడా 54 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ వేసింద న్నారు. మన దేశంలో మాత్రం కేవలం 17శాతం మందికే ఇప్పటి వరకు రెండు డోసుల వ్యాక్సిన్లు అందాయని వివరించారు. ఇదే పద్దతి కొనసాగితే దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యం 2030కి కూడా పూర్తికా వడం కష్టమని అన్నారు. రోజుకు కోటిన్నర మందికి వ్యాక్సిన్లు వేస్తేనే మూడో వేవ్‌ను తట్టుకోగలుగుతామని, లేనిపక్షంలో 4, 5 వేవ్‌లు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఈ ముప్పు తప్పాలంటే బీజేపీని గద్దె దించాల్సిం దేనని చెప్పారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. త్రిపురలో బీజేపీ విధానాలకు సిపిఎం అడ్డుకట్టవేయడంతో భరించలేక అక్కడి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంతో పాటు, పలు ఇతర కార్యాలయాలను ధ్వంసం చేశారన్నారు.