Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో 11.39 శాతానికి చేరిక
- తయారీ ఉత్పత్తులు ప్రియం
న్యూఢిల్లీ : ప్రభుత్వం వరుసగా పెంచుతోన్న చమురు ధరల వల్ల టోకు ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రజల ఆర్థిక పరిస్థితి సన్నగిల్లగా.. అధిక ధరలు సామాన్యుల కొనుగోలు శక్తిని మరింత హరించుకుపోయేలా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఇంధన బాదుడు విధానాలతో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో ప్రస్తుత ఏడాది ఆగస్టులో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఇది వరకు ఎప్పుడూలేని విధంగా 11.39శాతానికి ఎగబాకింది. ముడిచమురు, నూనెలు, కమాడిటీ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగిసిందని మంగళవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. విత్తనాలు, ఖనిజాలు, అహారేతర ఉత్పత్తుల ధరలు పెరిగాయి. గడిచిన జులైలో డబ్ల్యూపీఐ 11.16 శాతంగా చోటుచేసుకుంది. గతేడాది ఇదే ఆగస్టులో డబ్ల్యూపీఐ 0.41 శాతంగా నమోదయ్యింది. వరుసగా ఐదు మాసాల్లోనూ డబ్ల్యూపీఐ రెండంకెల పెరుగుదలతో సామాన్యులకు దడ పుట్టిస్తున్నది. చమురు, సహజ వాయువు, రసాయనాలు, టెక్స్టైల్, లోహాల ధరలు పెరిగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 5.3శాతానికి తగ్గింది.
ఇంతక్రితం మాసంలో ఇది 5.59 శాతంగా నమోదయ్యింది. సీపీఐ, టోకు ధరల సూచీకి ఎప్పుడూ అంతరం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ దేవేంద్ర పంత్ పేర్కొన్నారు. వరుసగా నాలుగో మాసంలో టోకు అహారోత్పత్తుల ధరలు తగ్గాయి. గడిచిన ఆగస్టులో తయారీ రంగ ఉత్పత్తులు 11.39 శాతం ఎగిశాయి. జులైలో ఇది 11.20 శాతంగా ఉంది. గడిచిన నెలలో ముడి చరురు, సహజ వాయువు ద్రవ్యోల్బణం ఏకంగా 40.03 శాతం పెరిగింది. వరుసగా ద్రవ్యోల్బణం ఎగిసిపడటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్ల తగ్గింపునకు ప్రధాన అడ్డంకిగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.