Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో ఇప్పటికీ ఉనికిలోనే..!
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
- నిపుణులు, విశ్లేషకుల ఆందోళన
న్యూఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచం 21 శతాబ్దంలో ఉన్నది. శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్నది. ఆయా దేశాల ప్రభుత్వాలు చట్టాల ప్రకారం నిర్దిష్ట విధానాలతో ముందుకెళ్తున్నాయి. అయితే, మోడీ ప్రభుత్వ పాలనలో భారత్‌లో మాత్రం ఇప్పటికీ వెట్టిచాకిరి జాఢ్యం ఉన్నది. అణగారిన వర్గాల ప్రజలు, ఎందరో పేదలు, కార్మికులు ఈ వెట్టిచాకిరికి బలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వెట్టిచాకిరిని ఎలాగైనా రూపుమాపాలనీ, ఈ విషయంలో ప్రభుత్వాలపై గురుతర బాధ్యత ఉన్నదని గుర్తు చేశారు.
బాండెడ్ లేబర్ అంటే ఏమిటీ?
బాండెడ్ లేబర్ (వెట్టి చాకిరీ) అంటే.. తీసుకున్న అప్పునకు చేసే చెల్లింపు లేదా ఇతర ఏదైనా కమిట్మెంట్కు బదులుగా పని చేయడానికి వ్యక్తి ఇచ్చే వాగ్దానం. ఇందులో రీపేమెంట్ విషయంలో నియమ, నిబంధనలు స్పష్టంగా, సహేతుకంగా ఉండవు. వెట్టి చాకిరి చేసే వ్యక్తి యజమాని వద్ద ఒక బానిసలా ఉండాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కార్మికుడు.. యజమాని వద్ద జీవితాంతమూ వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది. వెట్టి చాకిరి చరిత్ర చూస్తే.. పురాతన హిందూ సమాజంలో ఇది కనిపిస్తుంది. ఇది అనేక కులాలుగా విభజించబడింది. ముఖ్యంగా, అణగారిన కులాల ప్రజలే దీనికి బాధితులుగా మిగిలారు. పెత్తందారీ కులాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం, ఉనికిని చాటుకోవడానికి వెట్టిచాకిరికి బాటలు వేశాయని నిపుణులు గుర్తు చేశారు. పెత్తందారీ కులాలపై ఆధారపడే విధంగా అణగారిన కులాల ప్రజలపై ఒత్తిళ్లు పెరిగాయని వివరించారు. గతనెలలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో బాండెడ్ లేబర్‌కు సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కలూ పవార్ అనే ఒక గిరిజనుడు తన కుమారుడి అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బులు అవసరమయ్యాయి. అయితే, అతని వద్ద ఒక్క రూపాయీ లేకపోవడంతో రాందాస్ అంబూ కోర్డే నుంచి కేవలం రూ. 500 అప్పుగా తీసుకున్నాడు. దీంతో తన వద్ద తీసుకున్న రూ. 500కు గానూ కలూ పవార్‌ను రాందాస్ బాండెడ్ లేబర్‌గా పెట్టాడు. తన ఇంటిలో పనితో పాటు పశువులను మేతకు తీసుకెళ్లాలని ఆదేశించాడు. ఇందుకు గానూ ఎలాంటి వేతనాన్ని కూడా నిర్ణయించలేదు. ప్రతి రోజు ఉదయం ఒక చపాతీ, రాత్రి పూట తిండి మాత్రమే కలూ పవార్‌కు అందేది. మధ్యాహ్నం భోజనం మాత్రం ఉండేది కాదు. అయితే, ఈ విషయం ఎట్టకేలకు పోలీసుల వద్దకు చేరింది. దీంతో నిందితుడు రాందాస్‌పై బాండెడ్ లేబర్ నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 374 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజల్లో అవగాహనా లోపం
ఒక్క కలూ పవార్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎందరో అమాయకపు ప్రజలు, ముఖ్యంగా పేద, అణగారిన సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఈ వెట్టిచాకిరి భూతానికి బలవుతున్నారని నిపుణులు వివరించారు. ఇలాంటి అనేక ఘటనల్లో పోలీసు కేసులు నమోదవడం కానీ, బాధితులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడం కానీ జరగడం లేదని చెప్పారు. ఇదంతా వారిలో వెట్టిచాకిరి, చట్టాలకు సంబంధించిన అవగాహన లేకపోవడంతో పాటు ఆర్థికంగా వెనకబడి ఉండటమూ కారణాలని విశ్లేషకులు వివరించారు.
చట్టపరమైన భద్రతలు
దేశంలో అనేక రాష్ట్రాల్లో పలు చోట్లా వెట్టి చాకిరి భూతం ఉనికిలో ఉన్నది. అయితే, ఈ విషయంలో బాధితులు, సాధారణ ప్రజలే కాదు.. దేశ భవిష్యత్తును మార్చే విద్యార్థులు, యువ కుల్లోనూ అవగాహన లేదని నిపుణులు ఆవేదన చెందారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 కింద మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి పూర్తిగా నిషేదమన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అలాగే, ఆర్టికల్ 21.. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
రాజ్యాంగంలోని నిబంధనలే కాదు కొన్ని చట్టాలూ బాండెడ్ లేబర్‌ను నిరోధిస్తాయి. కనీస వేతన చట్టం, 1948ప్రత్యేకించిన పనికి సంబంధించిన కనీస వేతనాన్ని కచ్చితం చేస్తుంది. అలాగే, బాండెడ్ లేబర్ సిస్టమ్ (నిరోధక) చట్టం, 1976.. వెట్టి చాకిరి విషయంలో నిందితుడికి కనీసం మూడేండ్ల జైలు శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తుంది. అలాగే, ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 374.. చట్టవ్యతిరేక పనిని నేరంగా గుర్తిస్తుంది. దీని కింద.. నిందితుడు విక్షగా ఒక ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ భరించాల్సి ఉంటుంది.
ప్రభుత్వాల నుంచి సాయం శూన్యం
వెట్టిచాకిరి బాధితులకు ప్రభుత్వాల నుంచి కనీసం సాయం అందడం లేదని నిపుణులు తెలిపారు. పునరావాసం కింద వారికి ఇస్తున్న ట్రైనింగ్, పరిహారం ఏ మాత్రమూ సరిపోవడం లేదని వివరించారు.
ముఖ్యంగా, కుటుంబ సభ్యులకు బాండెడ్ లేబర్ స్టేటస్‌ను ఇవ్వడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంలో శ్రద్ధ వహించి వెట్టిచాకిరిని రూపుమాపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.