Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట కొనుగోళ్లలో వాటా 93శాతం ప్రయివేటు వ్యాపారులదే
- స్థానిక వ్యాపారులు చెప్పిన ధరకు అమ్ముకుంటున్న రైతులు
- దేశంలో 18 రకాల పంట కొనుగోళ్లపై జాతీయ నమూనా సర్వే
- వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వాలు కొనుగోలు చేసింది స్వల్పం
- తూకంలో..గ్రేడింగ్‌లో అక్రమాలు.. అంతిమంగా రైతుల్లో అసంతృప్తి
ప్రకృతి సవాళ్లను..రుణ బాధల్ని ఎదుర్కొని..ఎన్నో ఆశలతో వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న రైతుకు న్యాయం జరగటం లేదు. ఈసారి దిగుబడి బాగా వచ్చిందన్న సంతోషం ఎంతో సేపు నిలవటం లేదు. పంట కొనుగోళ్లలో ప్రయివేటు వ్యాపారులు, దళారులదే పైచేయి అవుతోంది. పంటలను తూకం వేయటంలో, గ్రేడింగ్‌లో మోసాలు..వెరసి నిరాశ, నిస్పృహ, నిర్వేదంతో రైతు ఇంటిముఖం పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ 'జాతీయ గణాంక కార్యాలయం' నేతృత్వంలో జరిగిన 77వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడైన ఫలితమిది.
న్యూఢిల్లీ : దేశానికి అన్నం పెడుతున్న రైతన్న పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో..'జాతీయ నమూనా సర్వే'(ఎన్ఎస్ఎస్) గణాంకాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నో కష్టనష్టాల్ని దాటి...పంటను తీసుకొని మార్కెట్ యార్డ్‌లకు వస్తే అక్కడ కనీస మద్దతు ధర దక్కటం లేదు. అంతేకాదు..పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు. దాంతో స్థానిక మార్కెట్లో ప్రయివేటు దళారులు, ట్రేడర్స్‌కు అమ్ముకోవాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా రైతులు పండించిన వివిధ రకాల పంట ఉత్పత్తుల్లో కేవలం 2 నుంచి 14శాతం మార్కెట్ యార్డులు కొనుగోలు చేయగా, 55 నుంచి 93శాతం ప్రయివేటు వ్యాపారులు, దళారులు కొనుగోలు చేశారని 'ఎన్ఎస్ఎస్' తాజా సర్వే వెల్లడించింది. పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోవటంతో, స్థానిక మార్కెట్లో దళారులు, ట్రేడర్స్ చెప్పిన ధరకు తమ పంటల్ని రైతులు అమ్ముకున్నారని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) నేతృత్వంలో నిర్వహించిన 77వ జాతీయ నమూనా సర్వే(ఎన్ఎస్ఎస్)లో నమోదైన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వ ఏజెన్సీలు, మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు తగ్గాయని సర్వే తెలిపింది. మొత్తం 18 రకాల పంట కొనుగోళ్లపై సర్వే నిర్వహించగా, వీటిలో అత్యధిక భాగం (55 నుంచి 93శాతం) పంట కొనుగోళ్లకు ప్రయివేటు దళారులు, ట్రేడర్స్‌ను రైతులు ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసింది కేవలం 2 నుంచి 14శాతం వరకే ఉంది. ప్రధాన పంటలైన వరి, గోధుమ, చెరుకులో అత్యధిక భాగం వ్యవసాయ మార్కెట్ యార్డులకు తరలివచ్చినప్పటికీ, రైతుల పంటలో 75.1శాతం ప్రయివేటు దళారులు, ట్రేడర్స్ కొనుగోళ్లు చేశారని సర్వే తెలిపింది. ప్రభుత్వ ఏజెన్సీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు జరిపిన పంట కొనుగోళ్లు కేవలం 10.5శాతమే ఉందని తేలింది. గోధుమల విషయంలోనూ 66శాతం పంటను స్థానిక వ్యాపారులే కొనుగోలు చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు, మార్కెట్ కమిటీలు కొనుగోలు చేసింది 26శాతమే ఉంది.
అక్కడైనా ధర వస్తోందా?
పప్పులు, గింజ ధాన్యాల్లో అత్యధికం స్థానిక వ్యాపారులే కొనుగోలు చేశారు. కంది పంటలో 68శాతం స్థానిక వ్యాపారులు, 22శాతం మార్కెట్ కమిటీలు కొనుగోలు చేశాయి. ప్రభుత్వ ఏజెన్సీలు కేవలం 1శాతం కొన్నాయి. పెసర్లలో 93శాతం పంటను స్థానిక వ్యాపారులు కొనుగోలు చేయగా, 5శాతం వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ ఏజెన్సీలు సేకరించాయి. స్థానిక వ్యాపారులు సరైన ధర చెల్లిస్తున్నారా? కనీస మద్దతు ధర లభ్యమైందా? అని సర్వేలో పాల్గొన్న రైతుల్ని ప్రశ్నించగా, అత్యధికభాగం 'అసంతృప్తి' వ్యక్తం చేశారు.
రైతుల్ని వేధిస్తున్న అక్రమాలు..
ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పంటను తీసుకొస్తే..రైతులకు దక్కే ధర న్యాయంగా లేదని సర్వేలో పాల్గొన్న అత్యధికమంది అభిప్రాయపడ్డారు. ఏదేమైనా పంట కొనుగోళ్ల తర్వాత రైతులు ఏమాత్రమూ సంతోషంగా లేరని సర్వే స్పష్టంగా పేర్కొంది.
దీనికి ఐదు కారణాలు ఉన్నాయని సర్వే తెలిపింది. మార్కెట్ ధరకన్నా తక్కువకు పంటను అమ్ముకోవాల్సి రావటం, పంట అమ్ముకున్నాక..వాటి చెల్లింపుల్లో తీవ్ర జాప్యం, రావాల్సిన దాంట్లో అత్యధికభాగం పంట రుణాల కింద లెక్క చూసుకోవటం, పంట తూకం వేయటంలో, గ్రేడింగ్ ఇవ్వటంలో అక్రమాలు...మొదలైనవి రైతుల్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. వరి కొనుగోళ్లపై 37.1శాతం రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.