Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులపై చర్యలు తీసుకోవాలి
- ఇండ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలి
- త్రిపురలో బీజేపీ బీభత్స, బెదిరింపు పాలన
- ప్రజాస్వామ్య, మానవ హక్కుల ఉల్లంఘన
- సీపీఐ(ఎం) కార్యాలయాలపై ఉద్దేశ్యపూర్వక, ప్రణాళికబద్దదాడులు
- వాస్తవాలను నివేదించే మీడియా సంస్థలపై దాడి : మీడియా సమావేశంలో సీతారాం ఏచూరి
- త్రిపురలో రాజ్యాంగం పని చేయటం లేదు : మాణిక్ సర్కార్
- దాడికి గంట ముందే సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ : జితిన్ చౌదరి
న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) కార్యాలయాలపైన, కార్యక ర్తలు, నాయకులపైన, మద్దతుదారుల ఇండ్లపైన, వారి ఆస్తులపైన దాడులు ఆపాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. మంగళవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాల యం (ఎకెజి భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మాణిక్ సర్కార్, మాజీ ఎంపీ జితిన్ చౌదరిలతో కలిసి సీతారాం ఏచూరి మాట్లాడారు. త్రిపురలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల అమలుపై ప్రజల్లో నెలకొన్న కోపం, నిరాశ నేపథ్యంలో సీపీఐ(ఎం), లెఫ్ట్ ఫ్రంట్ చేపడుతున్న ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రతిపక్ష కార్యకలాపాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన బీభ త్సం, బెదిరింపు పాలనను సాగిస్తున్నదని విమర్శిం చారు. ఈ వాస్తవాన్ని నివేదించే మీడియా సంస్థలపై కూడా దాడి చేసిందని ఆరోపించారు. ఉ ద్దేశ్యపూర్వ కంగా, ప్రణాళికబద్ధంగా దాడులు చేశారని విమర్శిం చారు. ఇది భారత రాజ్యాంగం, రాజ్యాంగం ద్వారా ప్రజలకు హామీ ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పనిచేసే నిబంధనలన్నీ బీజేపీ ప్రభుత్వ నాయకత్వంలో త్రిపురలో నిలిపివేయబడ్డాయని తెలిపారు. ఇదే బీజేపీ వాస్తవ ప్రవర్తన అని విమర్శించారు.
ముఖ్యమంత్రే రెచ్చ గొట్టే వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయనీ, ఈ ఉద్యమాల్లో సీపీఐ(ఎం), వామపక్షాలు ముందు న్నాయని తెలిపారు. బీజేపీ వ్యతిరేక వాతావరణం రాకుండా ప్రజా ఉద్యమాలను అనుమతించటం లేద నీ, అందులో భాగంగానే ఈదాడులు జరుగుతున్నా యని పేర్కొన్నారు. ఈ బీభత్సం, హింసకు ఇదే కారణమని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం)పై దాడులను సమర్థిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా అత్యంత రెచ్చగొట్టే, బెదిరింపులతో కూడిన ప్రకటనలు చేశారనీ, ఆయన పూర్తి అబద్ధాలు మాట్లాడటం శోచనీయమన్నారు. 2018లో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ మహిళా సీపీఐ(ఎం) కార్యకర్తతో సహా 21 మంది సీపీఐ(ఎం) సభ్యులు, మద్దతుదారులు హత్యకు గురయ్యారని వివరించారు.
జై శ్రీరామ్ నినాదాలతో దాడి
సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరిగిన అనేక దాడుల్లో బీజేపీ గూండాలు జై శ్రీ రామ్ అని నినాదాలు చేస్తూ ఇనుప రాడ్లు, పెట్రోల్ బాంబులతో హింసను సృష్టించారన్నారు. పోలీసులు పూర్తిగా బీజేపీ ఎజెంట్లుగా మారారని విమర్శించారు. త్రిపురలో జరిగిన దాడులన్నింటిని వివరిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాననీ, కానీ ఆయన కనీసం స్పందించలేదని అన్నారు. ప్రముఖ గిరిజన నాయకుడు, గణ ముక్త పరిషత్ నేత నేత, మాజీ ముఖ్యమంత్రి దశరథ్ దేవ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆయన రాజాలకు వ్యతిరేకంగా పోరాడి, త్రిపురను భారతదేశంలో భాగం చేయడానికి కృషి చేశారని తెలిపారు. ఆ చరిత్రిక వారసత్వం కలిగిన నేతల విగ్రహాలు ఉండటం కూడా బీజేపీ నేతలు సహించలేకపో తున్నారనీ, ఎందుకంటే బీజేపీకి త్రిపుర ప్రజా పోరాట వారసత్వం లేదని తెలిపారు.
తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి
ఈ పరిస్థితుల్లో వీడియోల్లో గుర్తించిన అందరిపై చర్యలు తీసుకోవాలనీ, దాడుల్లో గాయాలపాలైన వారికి, ఇండ్లు, దుకాణాలు, ఇతర ఆస్తి కోల్పోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలనీ, సీపీఐ(ఎం) వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై బనాయించిన తప్పుడు కేసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం), వామపక్షాలు, అన్ని ప్రతిపక్ష పార్టీలపై దాడులు, హింసను ఆపాలని డిమాండ్ చేశారు. మీడియాపై దాడులు ఆపాలి, వాటిని స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించాలని కోరారు.
త్రిపురలో రాజ్యాంగం పని చేయటం లేదు : మాణిక్ సర్కార్
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాణిక్ సర్కార్ మాట్లా డుతూ త్రిపురలో భారత రాజ్యాంగం పని చేయటం లేదనీ, త్రిపు రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 90శాతం ప్రాంతాల్లో ప్రతిపక్షాలు నామిషన్లు వేసేందుకు అనుమతించలేదని అన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో హోల్‌సేల్ రిగ్గింగ్ జరిగిందనీ, 1952 తరువాత 2019లోనే ఒక నియోజకవర్గంలోనే అత్యధిక కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లోకి అనుమతించటం లేదు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌లోనూ, వెలు పల ప్రతిపక్షాలపాత్ర చాలాకీలకమైనదనీ, కానీ త్రిపురలో ప్రతి పక్షాలపై దాడి చేస్తున్నారని, అందులో సీపీఐ(ఎం)పైన ఫోకస్ చేసి దాడులకు ఒడిగడుతున్నారని విమర్శించారు. అలా కొన సాగుతూ ఇతర వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌పైన కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య నిర్వహణ, కార్యక్ర మాలను అనుమతించటం లేదని పేర్కొన్నారు. నాతో సహా మె జార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు, రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు వెళ్లనీయటం లేదని విమర్శించారు.
హామీల అమలులో విఫలం.. ప్రజల్లో పెరిగిన అసంతప్తి
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కార ణంగా ప్రతిపక్షాలపైన దాడులు తీవ్రమయ్యాయని విమర్శిం చారు. త్రిపురలో సీపీఐ(ఎం), వామపక్షాలకు పెరుగుతున్న ప్రజల మద్దతు బీజేపీని నిరాశకు గురిచేస్తున్నదని విమర్శిం చారు. త్రిపురలో బీజేపీ పాలన మైనస్ జీరో అని, అందువల్లనే ఇలాంటి దాడులు చేస్తున్నదని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించారని అన్నారు. నిరుద్యోగ యువతను, ఉపా ధ్యాయులను, గ్రామీణ, పట్టన పేదలను మోసం చేశారని విమ ర్శించారు. త్రిపురలో ఆకలి చావులు, నిరుద్యోగం పెరిగిందని, నేరస్థులకు లైసెన్స్ ఇస్తున్నారనీ, మరోవైపు ద్వేషం, విభజన విత్తనాలను నాటడానికి ఆర్ఎస్ఎస్ బిజీగా ప్రణాళికలు రూపొందిస్తుందని విమర్శించారు. ఇది త్రిపుర ప్రజల సమస్య మాత్రమే కాదని, దేశంలోని ప్రజాస్వామ్య, లౌకిక ప్రజల సమస్య అని తెలిపారు. ఈ ఫాసిస్ట్ దాడులను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
దాడికి గంట ముందు సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ : జితిన్ చౌదరి
మాజీ ఎంపి జితిన్ చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ కార్యా లయం వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను బీజేపీ కార్యకర్తల దాడికి గంట ముందు ఉపసంహరించుకున్నారని అన్నారు. సీపీ ఐ(ఎం) మద్దతుదారుల దుకాణాలు దహనం చేశారని, కొల్ల గొట్టారని వివరించారు. దాడులను ప్రోత్సహిస్తూ కొందరు బీజేపీ నాయకులు,మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని తెలిపారు.
మాణిక్సర్కార్ను సొంత నియోజకవర్గానికి వెళ్లనియ్యటం లేదు
సెప్టెంబర్ 6న ప్రతిపక్ష నేత, నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్‌ను తన సొంత నియోజకవర్గాన్ని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై అంతకుముందు భౌతికంగా దాడి చేసినప్పుడు పోలీసులు చూస్తూ ఉండిపోయారని విమర్శించారు.
సీపీఐ(ఎం) నాయకులను, కార్యకర్తలను భయపెట్టడానికి, మాట్లాడకుండా చేయడానికి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. త్రిపురలో సీపీఐ(ఎం) వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలపైన, స్వతంత్ర మీడియాపైన జరుగుతున్న దాడిని దేశంలోని ప్రజాస్వామ్య భావాలు కలిగిన వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఖండించాలని కోరారు.