Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు
న్యూఢిల్లీ : రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. బుధవారం మహారాష్ట్రలోని ధూలేలో భారీ కిసాన్ మజ్దూర్ ర్యాలీ జరిగింది. రాజస్తాన్‌లోని జైపూర్‌లో కిసాన్ సంసద్ జరిగింది. ఇందులో పలువురు ఎస్కేఎం నేతలు పాల్గొన్నారు. బీహార్‌లో చంపారన్‌లో కిసాన్ సమావేశం జరిగింది. కర్నాటకలో సెప్టెంబర్ 27 భారత్ బంద్ విజయవంతం చేయడానికి రాష్ట్ర స్థాయి ప్రణాళిక సమావేశం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగింది. రైతు సంఘాలే కాకుండా ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్లు, మహిళా, విద్యార్థి, వైద్య, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు వంటి దాదాపు 80 సంఘాల నుంచి 120కి పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు పంట కాలం ప్రారంభమైనప్పటికీ ఢిల్లీలో ఆందోళన కేంద్రాల్లో బలం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా రైతులు నిరసన స్థలాలలో చేరడం జరిగింది. బుధవారం గుజరాత్ నుంచి రైతుల బృందం ఘాజీపూర్ ఆందోళనకు చేరుకున్నది. ప్రహార్ కిసాన్ సంఘటన్ సైకిల్ మార్చ్ గ్వాలియర్‌కు చేరుకున్నది. చివరకు సెప్టెంబర్ 20న సింఘు సరిహద్దు వద్ద చేరుకుంటుంది.
బీజేపీకి ఎంఐఎం ''బీ'' టీం: రాకేశ్ తికాయత్
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం బీజేపీకి ''బి'' టీం అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ అన్నారు. అంతేకాకుండా బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ చాచా జాన్ అని పేర్కొన్నారు. ''ఒవైసీ, బీజేపీ ఒకే జట్టు. అతను బీజేపీకి చెందిన చాచా జాన్ (బాబారు). ఆయనకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి. అతను బీజేపీపై విమర్శలు గుప్పిస్తాడు. కానీ ఆయనపై బీజేపీ కేసు నమోదు చేయదు. కాషాయపార్టీ ఆయన సహాయం తీసుకుంటున్నది. రైతులు వారి ఎత్తుగడలను అర్థం చేసుకోవాలి. ఒవైసీ రైతులను నాశనం చేస్తాడు. ఎన్నికల సమయంలో వారు కుట్రలు చేస్తారు. కానీ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో సూచించినట్లుగా బాగ్పత్ ప్రజలు విప్లవాత్మకమైనవారు'' తికాయత్ అన్నారు.