Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో కేంద్రీకృత విధానాలు కనిపిస్తున్నాయనీ, ఇది సరైంది కాదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామరాజన్ అన్నారు. ఇతర దేశాల్లో చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ప్రోత్సహించినట్టుగా భారత్‌లో జరగడం లేదన్నారు. పైగా చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలను నియంత్రించడం ద్వారా మరింత కేంద్రీకృతం కావాలని కోరుకుంటున్నారనీ, ఇది దేశానికి మంచిది కాదన్నారు. కేంద్రం రెవిన్యూలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంచడం లేదని చెప్పారు. సమాఖ్య విధానానికి విరుద్ధంగా వివిధ రకాల సెస్సుల ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగాన్ని కేంద్రం తీసుకుంటున్నదనీ, ఫలితంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని ఆక్షేపించారు. కేంద్రంలో కూడా అధికారం కొద్ది మంది చేతుల్లోనే ఉందనీ, దీనివల్ల దేశం తిరోగమనం వైపు వెళ్తున్నదని అన్నారు. ప్రభుత్వ బ్యాంకులకు కొత్త సీఈఓ లను నియమించడంలో జాప్యం జరుగుతున్నదనీ, ప్రతి చిన్న విషయానికి అందరూ కేంద్రం వైపే చూస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాల కోసం పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. బంగారం రుణాలు పెరిగాయనీ, దేశంలో ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలోనే బంగారం తాకట్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయన్నారు. బరగారం వినియోగంలోనూ స్వల్ప తగ్గుదల ఉందన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నగదు బదిలీ చేపట్టాలని సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ భారత దేశానికి నగదు బదిలీ జరుగుతోందని, ఇలాంటి వ్యవస్థే పట్టణ ప్రాంతాల్లోనూ అమలుచేయాలని సూచించారు. పన్ను దాఖలు చేసే వెబ్సైట్లో లోపాలను సరిచేయడానికి ఐటీ సంస్థ అసమర్థత ప్రదర్శించిందంటూ ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న వారపత్రిక ఇన్ఫోసిస్‌పై దాడి చేయడంపై ఆయన స్పందించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభంలో పేలవమైన పనితీరు కనబరిచినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం దేశద్రోహి అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. జీఎస్టీ లోపాలను సరిదిద్దుకోవాలనీ, దాన్ని వ్యక్తిగత ఈర్య్సాద్వేషాల వేదికగా వినియోగించకూడదని కేంద్రానికి చురకలంటించారు. దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతోందన్నారు. అయితే ధనికులు, ఎగువ మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే వస్తువులు, పేద వర్గాలు కొనుగోలు చేసే వస్తువుల మధ్య వ్యత్యాసాన్ని ఈ వృద్ధి ఎత్తిచూపుతున్నదని విశ్లేషించారు. కార్ల విక్రయాలు పెరిగి, మోటార్‌సైకిళ్ల విక్రయాలు క్షీణించాయని ఉదహరించారు. జీఎస్టీ వసూళ్లు ఏటా 30 శాతం పెరుగుతూ, ఆగస్టులో రూ.1.12 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు.