Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న మోడీ జన్మదినం.. టెలిగ్రాం ద్వారా
ప్రతిఘటించండి : బృందాకరత్
విశాఖ : ఏ హక్కుతో స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సంపదను అమ్మడానికి ఇది ఎవరబ్బ సొత్తు కాదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద నిర్వహిస్తోన్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని బుధవారం సాయంత్రం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రజా సంపదని, బీజేపీ వారసత్వంగా వచ్చిన సంపద కాదని స్పష్టం చేశారు. వేలాదిమంది భూములు త్యాగం చేసి, వారి రక్తాన్ని చిందించి విశాఖ ఉక్కు నెలకొల్పాలని తెలిపారు. 32 మంది ప్రాణాలర్పించి స్టీల్‌ప్లాంట్ నెలకొల్పారని అన్నారు. మోడీ ప్రభుత్వానికి వారి ప్రాణాల విలువ తెలుసా? అని ప్రశ్నించారు. ఈ నెల 17న మోడీ జన్మదినం రోజున విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికవర్గం టెలిగ్రామ్ ద్వారా తమ ప్రతిఘటన తెలియజేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించిన ఒక్క శాతం కూడా విశాఖ స్టీల్‌ను అమ్మలేకపోయారని, ఇప్పుడు వంద శాతం ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. మన దేశానికి ప్రభుత్వ రంగ సంస్థలు వెన్నుముకగా నిలిచాయని, ఇప్పుడు వాటిని అమ్మేయడం దారుణమని అన్నారు. ఆర్థికంగా దేశానికి అండగా ఉన్న ఫైనాన్స్, డిఫెన్స్, ఎల్ఐసి, రైల్వేస్‌ను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. బిజెపి ప్రభుత్వం తన మనస్సాక్షిని కార్పొరేట్ శక్తులకు అమ్ముకుందని విమర్శించారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు శక్తులకు అప్పగించడానికి కుట్రలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి లక్షలాది మంది రైతులు పోరాడుతున్నారని తెలిపారు. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని, అలాంటి వారి పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని అన్నారు. గత తొమ్మిది నెలల్లో రైతు పోరాటంలో 700 మంది వరకు రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్.నర్సింగరావు, మంత్రి రాజశేఖర్, కన్వీనర్ జె.అయోధ్యరామ్, స్టీల్ ప్లాంట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
నేడు బహిరంగ సభ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో గురువారం ఉదయం 10 గంటలకు బహిరంగ సభ జరగనుంది. దీనికి బృందాకరత్ హాజరు కానున్నారు.