Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సీఎం మాణిక్ సర్కార్
అగర్తల : త్రిపురలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన విషయంలో రాష్ట్ర ఓటర్లు తమ తప్పును తెలుసుకున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఇప్పుడు వారంతా వామపక్ష కూటమి వైపు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఒక వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైన కారణంగానే రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులకు కారణమని మాణిక్ సర్కారు అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రజలు, మహిళలు, యువతతో పాటు రాష్ట్రంలోని ప్రజలంతా చాలా కోపంతో, నిరాశతో ఉన్నారని చెప్పారు. తాము మోసపోయినట్టుగా భావిస్తున్నారని తెలిపారు. '' ఇలాంటి తరుణంలో సీపీఐ(ఎం) ఒక బొమ్మలా కూర్చోలేదు. రాష్ట్రంలో జీవనోపాధి, ఆహారం, ఆరోగ్య రంగం సౌకర్యాలతో పాటు పలు అంశాలపై మా గొంతు వినిపిస్తూనే ఉన్నాం. మా ప్రచార కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం క్రమంగా పెరిగింది. ఈనెల 6న నా నియోజవర్గం ధన్‌పూర్‌లో ఒక నిరసనలో పాల్గొనడానికి వచ్చిన నన్ను ఆపే ప్రయత్నం వారు (ప్రభుత్వం) చేశారు. వారు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గత 25 ఏండ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న నా నియోజకవర్గంలో పర్యటించకుండా చాలాసార్లు ఆపారు'' అని చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని మేము ప్రజలను కలుస్తున్నామనీ, వారి సమస్యలు వింటున్నామనీ, పరిష్కారాల కోసం చూస్తున్నామని చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయం వామపక్షాలే అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సీపీఐ(ఎం)పై బెంగాలీ మెజారిటేరియనిజం ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల మద్దతు లేకపోతే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయేవాళ్లమని గుర్తు చేశారు. ఇక త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉనికి గురించి ప్రస్తావిస్తూ.. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే టీఎంసీ నియంత్రిత మీడియా తృణమూల్ గురించి ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నదని చెప్పారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోని పరిస్థితులు వేరని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో గెలిచినంత మాత్రన త్రిపురలో గెలిచినట్టు కాదని అన్నారు. '' మా సిద్ధాంతం, సిన్సియారిటీ, ప్రజల పట్ల కమిట్మెంట్ మా ఆయుధం. అదే మేము చేస్తున్నాం. అదే కొనసాగిస్తాం. ప్రజలు తప్పులు చేయొచ్చు. ప్రతిసారి వారు సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. వీటి నుంచి వారు నేర్చుకుంటారు. మేము కూడా మా తప్పులు, ఓటమి నుంచి నేర్చుకుంటున్నాం'' అని మాణిక్ సర్కార్ చెప్పారు.