Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయిల చెల్లింపుపై నాలుగేండ్లు మారటోరియం
- టెలికాం రంగంలో కీలక సంస్కరణలు
- కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో నిర్మాణాత్మకమైన, విధానపరమైన పలు సంస్కరణలకు ఆమోదం తెలిపింది. టెలికాం రంగంలో మరిన్ని కీలక సంస్కరణలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి అవకాశాల సృష్టికి, ఆరోగ్యకరమైన పోటీకి, వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు, ఆపరేటర్ల లిక్విడిటీ అవసరాలు వంటి సంస్కరణలకు ఆమోదం తెలిపింది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహానికి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లపై ప్రభుత్వ నియంత్రణ భారం తగ్గేదిశగా ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని క్యాబినెట్ సమావేశం అనంతరం ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
9 నిర్మాణపరమైన సంస్కరణలు
- టెలికామ్ సెక్టార్లో ఆటోమేటిక్ రూట్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తారు.
- అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) హేతుబద్ధీకరణ: టెలికామేతర ఆదాయానికి ఏజీఆర్ నిర్వచనం నుంచి మినహాయిపు లభిస్తుంది.
- బ్యాంకు గ్యారంటీల హేతబద్ధీకరణ: లైసెన్స్ ఫీజు కోసం బ్యాంకు గ్యారంటీలు, ఇతర లెవీ రుసుముల ఆవశ్యకతను భారీగా తగ్గించడం, విభిన్న లైసెన్స్డ్ సర్వీస్ ప్రాంతాల్లో బహుళ బ్యాంకు గ్యారంటీల ఆవశ్యకతను తొలగించడం.
- వడ్డీ రేట్ల హేతుబద్ధీకరణ, జరిమానా తొలగింపు: లైసెన్స్ ఫీ, స్పెక్ట్రమ్ వినియోగ రుసుము చెల్లింపుల్లో జాప్యమైతే అక్టోబరు 1 నుంచి ఎస్బీఐ ఎంసీఎల్ఆర్కు అదనంగా రెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇది ఎంసీఎల్ఆర్కు అదనంగా నాలుగు శాతం ఉండేది. నెలవారీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా వార్షికంగా లెక్కిస్తారు. పెనాల్టీపై వడ్డీ, పెనాల్టీ తొలగిస్తారు.
- వేలం కోసం వాయిదా చెల్లింపుల భద్రతకు ఇక బ్యాంకు గ్యారంటీలు అవసరం లేదు.
- ఇకపై జరిగే వేలం ప్రక్రియల నుంచి స్పెక్ట్రమ్ కాలవ్యవధి 20 ఏండ్లకు బదులుగా 30 ఏండ్లుగా ఉంటుంది.
- పదేళ్ల తరువాత స్పెక్ట్రమ్ సరెండర్ చేసేందుకు అనుమతి లభిస్తుంది.
- ఇకపై స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్(ఎస్‌యూసీ) ఉండదు.
- స్పెక్ట్రమ్ షేరింగ్‌కు అదనంగా చెల్లించాల్సిన ఎస్‌యూసీ ఇకపై ఉండదు.
విధానపరమైన సంస్కరణలు
- ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తారు.
- సులభతరవాణిజ్యాన్ని ప్రోత్సహిస్తారు. వైర్లెస్ఎక్విప్మెంట్ కోసం ప్రస్తుతం ఉన్న లైసెన్స్ విధానానికి బదులుగా సెల్ఫ్ డిక్లరేషన్‌ను అమలు చేస్తారు.
- యాప్ ప్రాతిపదికన సెల్ఫ్-కెవైసి అనుమతిస్తారు.
- ఇప్పుడు అమలులో ఉన్న కస్టమర్ అక్విజన్ ఫామ్స్(సీఏఎఫ్)కు బదులు డిజిటల్ స్టోరేజీని అనుమతిస్తారు. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద వేర్వేరు గిడ్డంగుల్లో దాదాపు 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు పత్రాలు నిల్వ ఉన్నాయి. ఇకపై సీఏఎఫ్ వేర్‌హౌజ్ ఆడిట్ ఆవసరం లేదు.
- టెలికామ్ టవర్లకు ఎస్ఏసీఎఫ్ఏ క్లియరెన్స్‌ను సులభతరం చేశారు. సెల్ఫ్ డిక్లరేషన్ ప్రాతిపదికన పోర్టల్ ఇచ్చే డేటాను టెలికామ్ శాఖ అనుమతిస్తుంది. పౌర విమానయాన శాఖ తదితర ఇతర ఏజెన్సీలు ఈ పోర్టల్‌తో అనుసంధానమై ఉంటాయి.
ఆపరేటర్ల లిక్విడిటీ అవసరాలపై..
- ఎజిఆర్ తీర్పు నుంచి ఉత్పన్నమయ్యే బకాయిల వార్షిక చెల్లింపుల్లో మారటోరియం, వాయిదా నాలుగేళ్ల పాటు అమలులో ఉంటుంది. అయితే చెల్లించాల్సిన మొత్తాల నికర ప్రస్తుత విలువకు రక్షణ ఉంటుంది.
- గత వేలం ప్రక్రియల్లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు(2021 వేలం మినహాయించి) సంబంధించిన చెల్లింపుల బకాయిలపై మారటోరియం నాలుగేండ్ల పాటు ఉంటుంది. నికర ప్రస్తుత విలువకు రక్షణ ఉంటుంది.
- ఈ చెల్లింపు వాయిదా వల్ల తలెత్తే వడ్డీని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు ఈక్విటీ రూపంలో చెల్లించవచ్చు.