Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టిఎ) మంగళవారం అర్ధరాత్రి ర్యాంకులను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ స్కోర్ సాధించారు. ఇందులో తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. నలుగురు ఏపీ, ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ప్రథమ ర్యాంకు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకట ఆదిత్య మొదటి ర్యాంకును సాధించినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీ నుంచి దుగ్గినేని వెంకటపణీష్, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్ నాయుడు, కర్నం లోకేశ్‌లు అగ్రస్థా నంలో నిలిచారు. ఈఫలితాలను jeemain.nta.nic.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ఈనెల 11న ప్రారంభం కావాల్సి ఉండగా, ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా 13కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొదట మంగళవారం రాత్రి ఫలితాలు ప్రకటిస్తారని పేర్కొన్నప్పటికీ.. అర్ధరాత్రి దాటాక ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ నాలుగో విడత పరీక్షలు ఆగష్టు 26, 27, 31, సెప్టెంబర్ 1న జరిగిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 6న పరీక్ష ప్రశ్నాపత్రం కీ పేపర్‌ను విడుదల చేశారు. సిబ్బంది అనారోగ్యానికి గురికావడం కారణంగానే ఫలితాలు ఆలస్యమయ్యాయని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషీ వెల్లడించారు. గత మూడేళ్లుగా మెయిన్ ఫలితాలను అర్ధరాత్రి, తెల్లవారు జామున విడుదల చేస్తూ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుందంటూ విద్యావేత్తలు విమర్శించారు.
జేెఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ స్కోర్ 87.89
జేఈఈ-మెయిన్‌లో 87.89కి పైగా మార్కులు సాధించిన విద్యార్ధులు ప్రతిష్టాత్మకమైన ఐఐటిల్లో అడ్మిషన్లకు కోసం జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఇచ్చిన ఈ కటాఫ్ స్కోర్ గతేడాది 90.37 కన్నా తక్కువగానే వుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 66.22, ఓబీసీలకు 68.02, ఎస్సీలకు 46.88, ఎస్టీలకు 34.67 స్కోర్ కటాఫ్ మార్కులుగా నిర్ణయించింది. 100 పర్సంటైల్ స్కోర్ సాధించిన 44 మంది విద్యార్థుల్లో తెలంగాణ, ఢిల్లీలకు చెందిన వారు ఏడుగురు చొప్పున వున్నారు. టై బ్రేకర్ రూల్స్ ఉపయోగించి ఈ ఏడాది టాప్ ర్యాంక్‌ను పంచుకోవడానికి 18 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. జేఈఈ మెయిన్ నాలుగో విడతలో 10,48,012 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 9,39,008 మంది విద్యార్ధులు పరీక్ష రాశారు. గతేడాది కన్నా దాదాపు లక్ష మంది తక్కువగా ఈసారి రాశారు. హర్యానాలోని సోనేపట్‌లో జరిగిన కుంభకోణం వల్ల ఈ ఏడాది పరీక్షలకు అంతరాయం కలిగింది. రూ.15లక్షల వరకు చెల్లించిన విద్యార్థులకు అక్రమంగా సాయం అందించేందుకు గానూ కంప్యూటర్లను హ్యాక్ చేశారు. ఇప్పటివరకు 11మందిని ఇందుకు సంబంధించి అరెస్టు చేశారు. దీనిపై సిబిఐ దర్యాప్తు సాగుతోంది. అక్రమ మార్గాలు ఉపయోగించినందుకు 20మంది అభ్యర్థులను మూడేళ్ల పాటు డిబార్ చేశారు. వారి రిజల్ట్‌ను కూడా నిలుపు చేసినట్లు ఎన్‌టిఎ తెలిపింది.