Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 77 లైంగికదాడులు నమోదవుతున్నాయి. ఈ దారుణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, యూపీ మొదటి,రెండు స్థానాల్లో ఉన్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020లో కేసులు నమోదు 28 శాతం పెరిగిందని తాజాగా ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన కేసులు నమోదు సైతం ఏకంగా 21 రేట్లు అధికమైందని ఈ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో షెడ్యూల్డ్ కులాలవారిపై నేరాలు 9.4 శాతం పెరిగాయనీ, మొత్తం 50,291 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో దాడులకు సంబంధించినవి అధికంగా 32.9శాతం ఉన్నాయి. అలాగే, అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదైన కేసులు 8.5 శాతం, నేరపూరిత బెదిరింపు కేసులు 7.5 శాతం ఉన్నాయి. ఇక షెడ్యూల్డ్ తెగలపై 8,272 కేసులు నమోదయ్యాయి.
2019తో పోలిస్తే 9.3 శాతం పెరుగుదల నమోదైంది. 27.2 శాతం సాధారణ కేసులు, లైంగికదాడి కేసులు 13.7 శాతం, మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు 10.7 శాతం నమోదయ్యాయి. ఇక రాజద్రోహం కేసులు 73 నమోదుకాగా, ఇందులో మణిపూర్లో 15, అసోంలో 12, కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్లో 7, హర్యానాలో 6, ఢిల్లీలో ఐదు, జమ్మూకాశ్మీర్లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే సైబర్నేరాలు 2020లో 11.8 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. దేశంలో అత్యధికంగా క్రైమ్ కేటు గుజరాత్లో ఉంది. తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు ఉన్నాయి. దేశంలో నమోదైన లైంగికదాడి కేసుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.