Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకస్మిక మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సంతాపం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, త్రిపుర రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ గౌతమ్ దాస్ ఆకస్మిక మృతి పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోల్‌కతాలోని ఆస్పత్రిలో కోవిడ్‌కి చికిత్స తీసుకుంటూ ఆయన గురువారం ఉదయం మరణించారు. ఆయన వయసు 70సంవత్సరాలు. పాఠశాల రోజుల నుండే గౌతమ్‌దాస్ రాజకీయాల్లో చాలా చురుకుగా వుండేవారు. రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనేవారు. ఆయన కాలేజీలో చదువుతుండగానే పార్టీ వారపత్రిక దేశర్కథలో చేరారు. 1979లో దేశర్కథ్ దినపత్రికగా మారినపుడు ఆయన దాని వ్యవస్థాపక సంపాదకులుగా వున్నారు. 2015 వరకు ఆయన ఈ బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన పార్టీలో నిర్మాణ బాధ్యతలను చూశారు. దేశర్కథను పూర్తిస్థాయి వార్తాపత్రికగా అభివృద్ధిపర్చడంలో ఆయన చాలా కృషి చేశారు. అగర్తలా ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. సాంస్కృతికోద్యమంలో ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. త్రిపుర సంస్కృతి సమన్వయ కేంద్ర వ్యవస్థాపక కార్యదర్శిగా వున్నారు. 1968లో ఆయన పార్టీలో చేరారు. 1986లో త్రిపుర రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1994లో రాష్ట్ర కార్యదర్శివర్గానికి ఎన్నికై, 2018లో కార్యదర్శిగా చేశారు. 2015లో పార్టీ 21వ మహాసభల్లో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. గత మూడేండ్లుగా, భయానక వాతావరణాన్ని ఎదుర్కొంటున్న పార్టీకి సారధ్యం వహించేందుకు ఆయన దృఢంగా పనిచేశారు. చిట్టగ్యాంగ్‌లో ఆయన కుటుంబ మూలాలు వున్నాయి. బంగ్లాదేశ్‌తో ఆయనకు ఎంతో అనుబంధం వుంది. అందువల్ల పార్టీ తరపున అక్కడ గల రాజకీయ పార్టీలతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించడానికి వీలు పడింది. ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారు. పార్టీ ప్రయోజనాల పట్ల నిబద్దత కలిగిన, అత్యంత విశ్వాసపాత్రుడైన కామ్రేడ్‌గా వున్నారు. త్రిపురలో పార్టీ దారుణమైన, విషపూరితమైన, హింసాత్మక దాడులను ఎదుర్కొంటున్న తరుణంలో గౌతమ్ దాస్ ఆకస్మిక మృతి పార్టీకి తీరని నష్టమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆయన భార్య తపతి సేన్, కుమార్తె స్వాగత్ దాస్, ఇతర కుటుంబ సభ్యులకు పొలిట్‌బ్యూరో తమ సంతాపాన్ని, సానుభూతినితెలియజేసింది.