Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ హర్యానా అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలపై ఎస్కేఎం ఆగ్రహం
- 22 నుంచి కబడ్డీ పోటీలు
- ఎంఎస్పీ అమలు చేయాలని మమతా బెనర్జీకి రైతు సంఘాల అల్టిమేట్
న్యూఢిల్లీ: రైతు ఉద్యమ బలోపేతానికి దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు ఊపందుకున్నాయి. మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లోని బిసర్బాడిలో షెట్కారి సంవాద యాత్ర గురువారం ప్రారంభమైంది. అంతకుముందు ఖండ్బరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ నెల 9న మహారాష్ట్ర నుంచి బయలుదేరిన సైకిల్ యాత్రలో ఉన్న ప్రహార్ కిసాన్ సంఘటన్ రైతులు 38 మంది మధ్యప్రదేశ్‌లోని మొరెనా, తరువాత రాజస్థాన్‌లోని ధోల్పూర్ చేరుకున్నారు. వారు మధుర, పాల్వాల్ మీదుగా ప్రయాణించి రెండు రోజుల్లో ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకుంటారు. ఈ నెల 27న భారత్ బంద్ విజయవంతం చేయడానికి వివిధ ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో, బీహార్‌లోని సీతామర్హిలో వ్యాపార, మర్చంట్స్ సంఘాలతో ప్రణాళికా సమావేశాలు జరిగాయి. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఉద్యమంలో పాల్గొన్న కాంచన్ (52) ఆకస్మిక మరణం పట్ల ఎస్‌కెఎం నివాళుర్పించింది. ఇంక్విలాబ్ మజ్దూర్ కేంద్రానికి చెందిన ఆయన తన పాటలు, స్కిట్లతో రైతులను ఉత్తేజపరిచేవారని ఎస్కేఎం గుర్తు చేసుకుంది.
బీజేపీ హర్యానా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఆగ్రహం
రైతుల ఆందోళనల కారణంగా హర్యానాలో మాదకద్రవ్యాల బెడద పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒపి ధంకర్ చేసిన వ్యాఖ్యలను ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. ఇది బీజేపీ రైతు వ్యతిరేక వైఖరిని మరోసారి తేటతెల్లం చేస్తోందని, ధంకర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతుగా కర్నాటక భౌగోళిక నిపుణుడి పాదయాత్ర
భౌగోళిక ప్రాదేశిక సాంకేతిక నిపుణుడు నాగరాజు కల్కుతగర్ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ఎంఎం హిల్స్ నుంచి తన పాదయాత్రను ఈ ఏడాది ఫిబ్రవరి 11న ప్రారంభించారు. 127 రోజులుగా 3,250 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద శాంతియుతంగా 12 నెలలు నిరసన ప్రదర్శనలను పూర్తి చేసిన 26 నవంబర్ 2021న సింఘు సరిహద్దుకు చేరుకోబోతున్నాడు. అప్పటికి నాగరాజు 7 నెలలకు పైగా రైతులకు, వారి డిమాండ్లకు మద్దతుగా ఏడు వేల కిలోమీటర్లు నడిచినట్లవుతుంది.
రైతు ఉద్యమ ఎఫెక్ట్
పంజాబ్‌లో రైతుల ఆందోళన తరువాత అదానీ అగ్రి లాజిస్టిక్స్ ఖిలా రారుపూర్‌లోని డ్రై పోర్టులో తన కార్యకలాపాలను విరమించుకుంది. అసోంలో అదానీ విమానాశ్రయం కోసం భూ సేకరణను రైతులు ప్రతిఘటిస్తున్నారు.
22 నుంచి కబడ్డీ పోటీలు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు ఈ నెల 22 నుండి టిక్రి, సింఘు వద్ద రైతులు ఐదు రోజుల కబడ్డీ లీగ్ నిర్వహించనున్నారు. హర్యానా, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి జట్లు లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. విజేత జట్టుకు రూ.3 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.2 లక్షలు నగదు బహుమతిగా అందిస్తారు. మెగా ఈవెంట్ కోసం సన్నాహాలు ప్రారంభ మయ్యాయని, బ్యానర్లు, పోస్టర్లు హర్యానా, పంజాబ్‌లో ఏర్పాటు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామని బికెయు నేత ప్రగత్ సింగ్ అన్నారు.
హర్యానా ప్రభుత్వం కమిటీ
కుండ్లీ-సింఘు సరిహద్దు వద్ద జాతీయ రహదారి -44 దిగ్బంధనాన్ని తొలగించడానికి రైతులతో మాట్లాడేందుకు హర్యానా ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. సాధారణ ప్రజల ప్రయోజనాల కోసం ఒక మార్గాన్ని విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు సోనిపట్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ లలిత్ సివాచ్ సోనిపట్‌లో రైతుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోం మంత్రి అనిల్ విజ్ కూడా పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడానికి, అదనపు ప్రధాన కార్యదర్శి (హౌం) రాజీవ్ అరోరా అధ్యక్షతన ఉన్నత స్థాయి ప్యానెల్ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో డిజిపి పికె అగర్వాల్, ఎడిజిపి (లా అండ్ ఆర్డర్) నవదీప్ సింగ్ విర్క్ సభ్యులుగా ఉన్నారు. ''సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దిగ్బంధనం కారణంగా సాధారణ ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారా? అనే అంశాలు పరిగణలోకి తీసుకొని కమిటీ సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చలు జరుపుతుంది'' అని హోం మంత్రి అనిల్ విజ్ అన్నారు.
కనీస మద్దతు ధర చట్టం అమలు చేయండి : ఏఐకేఎస్ సీసీ పశ్చిమ బెంగాల్ కమిటీ
కనీస మద్దతు ధర చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రంలో రైతులు ఆందోళన చేస్తారని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్ సీసీ) నేతలు తెలిపారు. పశ్చిమ బెంగాలోని కలకత్తా ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చట్టం తక్షణ అమలు కోసం ముఖ్యమంత్రికి అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల కోసం ముసాయిదాను పంపామని తెలిపారు. దీన్ని ఆమోదించి, వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రంలోని రైతులు పోరాట మార్గాన్ని ఎంచుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఇన్పుట్ ఖర్చు నిరంతరం పెరుగుతూనే ఉందని, పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదని పేర్కొన్నారు. దీంతో, రైతులు, వ్యవసాయ కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. (ఏఐకేఎస్ సీసీ జాతీయ కార్యదర్శి అవిక్ సాహా, రాష్ట్ర కార్యదర్శి కార్తిక్ పాల్ తదితరులు పాల్గొన్నారు.