Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్ముందు కరోనా ప్రభావం పెరగవచ్చు: ఐసీఎంఆర్ చీఫ్
- దేశంలో కొత్తగా 30 వేలకు పైగా కరోనా కేసులు
న్యూఢిల్లీ: పండగల సీజన్ రాబోతున్నదనీ, దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కేరళలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పారు. అయితే పండుగల సీజన్ ఉన్నందున ప్రజలు భారీ సంఖ్యలో గుమ్మికూడే అవకాశాలు ఉన్నాయనీ, అలాంటి వాతావరణంలో మళ్లీ వైరస్ ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నట్టు హెచ్చరించారు. అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలనీ, కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ.. బాధ్యతాయుతంగా ప్రయాణించాలనీ, పండుగలను కూడా బాధత్యతో జరుపుకోవాలని బలరామ్ భార్గవ్ సూచించారు. మరో మూడు నెలలు జాగ్రత్తలు తప్పని సరిగా తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం 68 శాతం కేరళలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ తెలిపారు. కేరళలో మొత్తం 1.99 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయనీ, మిజోరం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పది వేల యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. గడిచిన 11 వారాల నుంచి పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగా ఉందన్నారు. 64 జిల్లాల్లో మాత్రం కోవిడ్ పాజిటివిటీ 5 శాతానికి ఎక్కువగా ఉందన్నారు.
ఇక గత 24 గంటల్లో దేశంలో 30,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా 431 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,17,325 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,43,923 చేరింది. కొత్తగా కరోనా నుంచి 38,3036 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,25,60,474కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,42,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుండగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 76,57,17,137 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 64,51,423 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.