Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టు
- ఇకపై కాలుష్యం పెంచే కార్యక్రమాలు చేయబోమంటూ అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశం
- అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతించింది. నిమ జ్జనం చేసుకోవచ్చనీ, అయితే ఈ ఒక్క ఏడాదికే మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్‌లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్ర హాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర యించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నిమజ్జనానికి ఈ ఏడాదికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇది చాలా ఏండ్లుగా ఉన్న సమస్య అనీ, దీనికి ప్రత్యామ్నాయం లేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరు సంతప్తికరంగా లేదనీ, ఇదే చివరి అవకాశమని చెప్పారు. కోట్లాది రూపాయలు సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం వల్ల ఆ నిధులు వృథా అవుతున్నాయని ఆక్షేపించారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విగ్రహాల నిమజ్జనం కోసం 22 చిన్న చెరువులను ప్రభుత్వం సిద్ధం చేసిందనీ, కానీ అందులో పెద్ద విగ్రహాల నిమజ్జనం సాధ్యంకాదని చెప్పారు. అందుకే ఈ ఏడాదికి మినహాయింపు కోరుతున్నామన్నారు. దీనిపై పిటిషనర్ వేణుమాధవ్ స్పందిస్తూ ఏటా ఇలాగే చెబుతూ మళ్లీ మొదటికి వస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికే అనుమతిస్తున్నట్టు సీజేఐ తెలిపారు. ఇకపై హుస్సేన్‌సాగర్‌లో ఎలాంటి నిమజ్జన, కాలుష్యం పెంచే కార్యక్రమాలు చేపట్టబోమంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత తదుపరి అన్ని విషయాలు రాష్ట్ర హైకోర్టు పరిశీలిస్తుందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది.