Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలనంతా అంబానీ, అదానీల చుట్టే
- ప్రజలకిచ్చిన వాగ్దానాలకు తూట్లు
- మోడీని గద్దెదింపే పోరాటం అనివార్యం : విశాఖ బహిరంగ సభలో సీపీఐ(ఎం) నేత బృందాకరత్
విశాఖ : 'దేశ పాలనంతా అంబానీ, ఆదానీలకు మోడీ ఇచ్చిన వాగ్దానాల చుట్టే తిరుగుతుంది.. 2014-2019 ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ అమలకు నోచుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ వారికి కట్టబెడుతున్నది. మోడీని గద్దెదింపే అతి పెద్ద పోరాటం సమీప భవిష్యత్‌లో ఈ విశాఖ నుంచే ఉంటుంది' అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ ఉద్ఘాటించారు. 'బీజేపీ విధానాలను ప్రతిఘటిద్దాం.. 27 భారత్ బంద్‌ను జయప్రదం చేద్దాం... విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం' అనే నినాదంతో గురువారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన భారీ సభలో బృందాకరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులు పోరాడుతున్న తీరును ఆమె అభినందించారు. బీజేపీ పాలనపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగంలోని మౌలిక విలువలకు బీజేపీ ప్రభుత్వం చెద పట్టించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌లో ప్రజలంతా పాల్గొని బీజేపీ విదానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనాతో 4.50లక్షల మంది మృత్యువాత పడటానికి మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు. ఢిల్లీలోనే ఆక్సిజన్ అందక వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారని గుర్తుచేశారు. ప్రపంచంలో కరోనా మరణాలు 24శాతం అమెరికాలోనే సంభవించాయని, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉన్న చోట్ల ఆరోగ్య, సామాజిక వ్యవస్థలు ధ్వంసం కావడమే ఈ మరణాలకు కారణమని పేర్కొన్నారు. చైనాలో ఈ రేటు కేవలం 6 శాతమేనని, సోషలిస్టు వ్యవస్థ అక్కడి ప్రజల కోసం ఉందని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించిందని తెలిపారు.
ఎర్రజెండాపై కక్షగట్టిన మోడీ..
త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాలయాలపైనా, నాయకులు, కార్యకర్తల పైనా దాడులకు దిగుతూ ఎర్రజెండాపై నరేంద్రమోడీ కత్తిగట్టి వ్యవహరిస్తు న్నారని బృం దాకరత్ విమర్శించారు. కేరళలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారన్నారు.
త్రిపుర సంఘీభావ విరాళం రూ.55,124
త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాలయాలు, నాయకులపై బీజేపీ జరిపిస్తున్న దాడులకు వ్యతిరేకంగా, అక్కడ పార్టీని ఆదుకునేందుకు వేదిక నుంచి నేతలు ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు అక్కడికక్కడే రూ.55,124 విరాళాలను వసూలు చేసి బృందాకరత్‌కు అందజేశారు.