Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తాజా నిర్ణయాలను ఖండించిన సిఐటియు
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలను సిఐటియు తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్పై వివక్ష చూపుతూ ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించింది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. బకాయిల చెల్లింపుల వాయిదా పేరుతో ప్రైవేటు టెలికాం కంపెనీల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ.1.31 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని వదులుకుంటోందని, ఈ చర్య ప్రజలకు చెందిన చట్టబద్ధమైన బకాయిల చెల్లింపును సమర్థిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రభుత్వ రంగ సంస్థల వ్యతిరేక నిర్ణయాలను, దేశ వ్యతిరేక చర్యలను ఐక్యపోరాటాల ద్వారా ప్రతిఘటించాలని కార్మిక లోకానికి సిఐటియు పిలుపునిచ్చింది. టెలికాం రంగంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆటోమేటెడ్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టెలికాం కంపెనీల స్పెక్ట్రం బకాయిలను నాలుగేళ్ల పాటు చెల్లించాల్సిన అవసరం లేకుండా మారటోరియం విధించింది.