Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించరు : బృందాకరత్
రాజమహేంద్రవరం
ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కలిసి ఆదివాసీలపై క్రమ పద్ధతిలో కుట్ర పూరితమైన అప్రకటిత యుద్ధం ప్రకటించాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏమి చేస్తోందని, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. పోలవరం పునరావాసం బాధ్యత నుంచి తప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాల అమలుకు, హక్కుల సాధనకు పోలవరం నిర్వాసితులు ఐక్యంగా పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. భూమి కోసం, బతుకుదెరువు కోసం, హక్కుల సాధన కోసం జరిగే ఈ పోరాటాన్ని ముందుండి నడిపించాల్సిన గురుతర బాధ్యత ఆదివాసీ మహిళలపై ఉందన్నారు. పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యాన పోలవరం నిర్వాసితుల పోరు సభ తూర్పుగోదావరి జిల్లా విఆర్.పురం మండలం రేఖపల్లి మైసమ్మ గుడి ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బృందాకరత్ మాట్లాడుతూ పోల వరం ప్రాజెక్టు కారణంగా 376కుపైగా గ్రామాలను జలసమాధి చేస్తున్నారన్నారు. బాధితుల్లో 70 శాతం మంది గిరిజనులే ఉన్నారని తెలిపారు. భూమికి భూమి, ఇంటికి ఇల్లు, గ్రామానికి గ్రామం కల్పిం చాలని పునరావాస చట్టం చెబుతున్నా ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయ న్నారు. ఐక్య పోరాటాల ద్వారా పాలకులను దీనిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టం నేటికీ అమలుకు నోచుకోకపోవడం లేదని, ఆదివాసీలను అడవుల్లో నుంచి గెంటివేసేందుకు బీజేపీ ప్రభుత్వం చట్ట సవర ణలు చేయడం దుర్మార్గమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తోందని విమర్శించారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ పాలకుల నాటకాలు సాగనివ్వబోమని హెచ్చరిం చారు. గతంలో రూ.1.15 లక్షలు ఇచ్చిన వారికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని, ఎకరా భూమికి రూ.20 లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రభుత్వం ప్రకటించినట్లుగా రూ.10.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 28, 29 తేదీల్లో కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసి పోలవరం నిర్వాసితుల సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్ మిడియం బాబూరావు మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల పోరాటంలో 13 జిల్లాల ప్రజలూ భాగస్వాములు కావాలని కోరారు. పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ సభలో సీపీఐ(ఎం) రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి అరుణ్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు వంతల రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు గురునాథరావు పాల్గొన్నారు.