Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యన్న వ్యాఖ్యలకు వైసిపి నిరసన
- ఎంఎల్ఏ జోగి రమేష్ నేతృత్వం
- అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
- పరస్పరం రాళ్లదాడి
- పోలీసుల లాఠీచార్జి
- చంద్రబాబు ఇంటి ముట్టడి
- నిరసనకు దిగిన చంద్రబాబు
అమరావతి: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసిపి ఎంఎల్ఏ జోగి రమేష్ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి ఇంటి వద్ద శుక్రవారం చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైసిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్లలో నేరుగా చంద్రబాబు ఇంటి రక్షణ గేటు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలివేయడంతో వారు రెచ్చిపోయారు. చంద్రబాబు నివాసం నుండి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన ద్వారం ముందు బైటాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో బాబు నివాసానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసిపి కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దశలో రంగంలోకి దిగిన పోలీసులు చెదరగొట్టే పేరుతో టీడీపీ కార్యక్తలపై లాఠీచార్జి చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ననూ పోలీసులు కొట్టారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావును ఒక పక్కకు తోసేశారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలను బతిమలాడి పంపివేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న చంద్రబాబు విషయం తెలుసుకుని బయటకు వచ్చి అక్కడే నిరసనకు దిగారు. జడ్‌ప్లస్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు జోగి రమేష్ వెంట వచ్చిన పలువురు చోటామోటా కార్యకర్తలను అనుమతించిన పోలీసులు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా అనుమతించలేదు. ఉండవల్లి వద్దే నిలిపేశారు. ఘర్షణ సమయంలో జోగి రమేష్ కారు అద్దాలు పలిగాయి. డీఎస్పీ స్థాయి అధికారులు జోగి రమేష్‌ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని బతిమలాడటం కనిపించింది. చివరకు ఆయన స్వచ్చందంగా అరెస్ట్ కావడంతో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం చంద్రబాబు తన నివాసం నుంచి టీడీపీ కార్యాలయా నికి వెళ్లారు. దాదాపు గంట పాటు ఈ ఉద్రిక్త పరిస్థి తులు బాబు నివాసం వద్ద కొనసాగాయి. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఈఘటనపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతృత్వంలో నాయకులు పట్టాభి, బుద్ధా వెంకన్న, దాడికి గురైన టీడీపీ కార్యకర్తలు తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.