Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం 6 గంటల నుంచి 4 గంటల వరకు
- అత్యవసర సేవలకు మినహాయింపు : ఎస్కేఎం మార్గదర్శకాలు
- బంద్‌కు వివిధ వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 27 భారత్ బంద్ శాంతియుతంగా, స్వచ్ఛందంగా నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రైతాంగం తలపెట్టిన ఉద్యమం పది నెలలకు చేరుకున్న నేపథ్యంలో సెప్టెంబర్ 27 (సోమవారం) భారత్ బంద్‌కు ఎస్కేఎం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు వివిధవర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. అయితే భారత్ బంద్ విజయవంతం కావడానికి శుక్రవారం ఎస్కేఎం మార్గదర్శకాలను విడుదల చేసింది. సమాజంలోని అన్ని వర్గాలు రైతులతో చేతులు కలపాలనీ, ముందుగానే బంద్ గురించి ప్రచారం చేయాలని రైతు సంఘాలను కోరింది. బంద్ శాంతియుతంగా, స్వచ్ఛందంగా ఉంటుందని తెలిపింది. బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది. సెప్టెంబర్ 27న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ ఉంటుందని తెలిపింది. 'రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ బంద్', 'మోడీ మండిలను బంద్ చేస్తే, రైతులు భారత్ బంద్ చేస్తున్నారు' వంటి ప్రధాన బ్యానర్లు, థీమ్‌లు తీసుకోవాలని సూచించింది. బంద్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, దుకాణాలు, కర్మాగారాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు, వివిధ రకాల ప్రజా రవాణా, ప్రయివేట్ రవాణా, పబ్లిక్ ఫంక్షన్లు, ఈవెంట్లు మూసివేయాలని ఎస్కేఎం కోరుతుంది.
స్కీమ్ వర్కర్ల సమ్మెకు ఎస్కేఎం మద్దతు
అంగన్వాడీ, ఆశా, ఎన్‌సిఎల్‌పి, ఎస్ఎస్ఎ, ఎన్హెచ్ఎం కార్మికుల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 24న జరగనున్న ''స్కీమ్ వర్కర్స్'' ఆల్ ఇండియా సమ్మెకు ఎస్కేఎం క్రియాశీల మద్దతునిస్తుంది. ఈ కార్మికులు ప్రభుత్వరంగ యూనిట్లు, సేవల ప్రయివేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. నాలుగు కార్మిక కోడ్లను ఉపసంహరించుకోవడంతో పాటు, కనీస వేతనాలను అందించాలని కోరింది. కార్మికులుగా వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రధానంగా పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, చిన్నారుల సంరక్షణ, విద్య వంటి ప్రాథమిక సేవలను అందించే ఈ స్కీమ్ వర్కర్లు దోపిడీకి గురవుతున్నారని పేర్కొంది. జీవనాధార స్థాయి అలవెన్సులు కూడా పొందలేకపోతున్నారని ఎస్కేఎం గుర్తించింది. ఈ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ముందు వరుసలో ఉన్నారని తెలిపింది. ఈ లక్షలాది మంది కార్మికులకు ఎస్కేఎం అండగా ఉంటుందనీ, సెప్టెంబర్ 24న వారు తలపెట్టిన ప్రణాళికాబద్ధమైన అఖిల భారత సమ్మెకు పూర్తి సంఘీభావం తెలియజేసిందని ప్రకటనలో తెలిపింది.
భారత్ బంద్‌కు సన్నాహలు
భారత్ బంద్‌ను విజయవంతం చేయడానికి ఎఐకెఎస్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని సికార్‌లో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మహారాష్ట్రలోని నందుర్బార్లో ప్రారంభమైన షెట్కారి సంవాద్ యాత్ర ధూలే జిల్లా గుండా వెళ్లి శుక్రవారం నాసిక్ ముల్లర్‌కు చేరుకుంది. సెప్టెంబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ జరగనుంది. అదే రోజు మహారాష్ట్రలోని ముంబాయిలో భారత్ బంద్ విజయవంతానికి రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరుగుతుంది. సెప్టెంబర్ 22న ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన లక్షర్లో కిసాన్ మహాపంచాయత్ జరుగుతుందని ఎస్కేఎం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో బీజేపీ, మిత్రపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా స్థానిక నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌లోని జలంధర్‌లో బీజేపీ నాయకుడు హెచ్ఎస్ కహ్లాన్ అలాంటి నిరసనను ఎదుర్కొన్నారు. హర్యానాలోని పానిపట్‌లో జేజేపీ అధ్యక్షుడు అజరు చౌతాలాకు వ్యతిరేకంగా తరలివచ్చిన రైతులు పెద్దఎత్తున నల్ల జెండా నిరసనకు దిగారు. అనేక మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు
సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన సెప్టెంబర్ 27 భారత్ బంద్‌కు పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా తొమ్మిది నెలలుగా ఉద్యమిస్తున్న రైతులకు అభినందనలు తెలిపాయి. మోడీ ప్రభుత్వం కేవలం రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చర్యలను మాత్రమే అమలు చేయటం లేదనీ, ఐక్య పోరాటాలను బలహీన పరిచేందుకు మతపరమైన అంశాలపై ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తుందని కార్మిక సంఘాలు విమర్శించాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ కార్పొరేట్ అనుకూల అజెండాను అమలు చేస్తున్నదని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రకటించి ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెడతున్నారని విమర్శించారు. ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఘటనను ఖండిస్తున్నామని తెలిపాయి. ఎస్కేఎం పిలుపుకు మద్దతుగా దేశంలోని కార్మిక వర్గం మొత్తం భారత్ బంద్‌లో పాల్గొంటుందని వెల్లడించాయి. బ్యాంకులు, ఇన్సూరెన్సు, స్టీల్, ఎలక్ట్రిసిటి, కోల్, పెట్రోలియం, డిఫెన్సు, రైల్వే, పోర్టులు, ఎయిర్ ఇండియా, ఎయిర్ పోర్టులు, టెలికాం, పోస్టల్, అంతరిక్ష, న్యూక్లియర్ తదితర రంగాల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా బంద్‌లో పాల్గొంటామని తెలిపాయి. అందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ బడ్జెట్ పెంపు వంటి డిమాండ్లను కార్మిక సంఘాలు చేస్తున్నాయని తెలిపాయి.