Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపాదనను తిరస్కరించిన కౌన్సిల్
- స్విగ్గీ, జొమాటో..ఫుడ్ డెలివరీపై పన్నుపోటు !
- సర్వత్రా ఆసక్తిరేపిన లక్నో జీఎస్టీ 45వ కౌన్సిల్ సమావేశం
- కోవిడ్, జీవనాధార ఔషధాలకు పన్ను మినహాయింపులు కొనసాగింపు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గవని తేలిపోయింది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ కౌన్సిల్ మరోమారు మొండిచేయి చూపించింది. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్ని ఎజెండాలో చేర్చి..చర్చించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లక్నోలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్ అనంతరం కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కోవిడ్ సంబంధిత ఔషధాలపై పన్ను తగ్గింపు డిసెంబరు 31వరకు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంది. అలాగే కేన్సర్ సంబంధిత ఔషధాలపై ప్రస్తుతం 12శాతంగా ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. చమురు మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్పై 12శాతంగా ఉన్న జీఎస్టీని 5శాతానికి తగ్గిస్తున్నామని అన్నారు. సరుకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్టు వివరించారు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. కొత్తగా ఎలాంటి పన్నూ వేయటం లేదంటూనే, గతంలో సంబంధిత రెస్టారెంట్ జీఎస్టీ చెల్లించేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు ఆ జీఎస్టీ చెల్లించాలని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలన్న విషయంలో రాష్ట్రాలను కేంద్రం ఒప్పించలేకపోయింది. ఈ అంశం చర్చకు రాగా..ఇంధన ధరలు భారీగా పెరగడానికి కారణం కేంద్రం ఏకపక్షంగా విధిస్తున్న పలు రకాల సెస్లేనని వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కోవిడ్ సంక్షోభం తలెత్తాక 20 నెలల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యక్షంగా సమావేశమైంది. కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహించగా, వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు హాజరయ్యారు. ఇంతక్రితం సమావేశంలో కోవిడ్, జీవనాధారమైన ఔషధాలపై జీఎస్టీ పన్నును 5శాతానికి తగ్గించగా, తాజా సమావేశంలో మరికొన్ని ఔషధాలను ఈ పన్ను పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇది డిసెంబరు 31వరకు అమల్లో ఉంటుందని తెలుస్తోంది.